కల్వకుంట్ల కవిత పార్టీ పేరుపై గందరగోళం…
కల్వకుంట్ల కవిత పార్టీ పేరుపై గందరగోళం…
- ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని నరాల సత్యనారాయణ విమర్శలు
ఖమ్మం, ఆంధ్రప్రభ : కల్వకుంట్ల కవిత తమ పార్టీ పేరును ముందుగా “తెలంగాణ ప్రజా జాగృతి”గా పేర్కొన్నారని, అనంతరం మాట మార్చి ఏప్రిల్ 25న పత్రికా ప్రకటనలతో “తెలంగాణ రాష్ట్ర సేన”గా ప్రకటించారని, ఆ తర్వాత ఏప్రిల్ 30న “తెలంగాణ రక్షణ సేన”గా మరోసారి పేరు మార్చారని TRS (D) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ విమర్శించారు. పార్టీ పేరు విషయంలోనే స్పష్టత లేకుండా అయోమయంలో ఉన్నారని ఆయన అన్నారు.
“తెలంగాణ రక్షణ సేన” అనే పేరు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కాలేదని, ఇదే తరహాలో ఉన్న “తెలంగాణ రక్షణ సమితి” పేరుతో పోలిక ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం 30 రోజుల్లో అభ్యంతరాలు లేకపోతేనే రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పటికే తమవైపు నుంచి ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేశామని చెప్పారు.
ఇంకా పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తికాకపోయినా, కవిత ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రిజిస్ట్రేషన్ అయినట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. తల్లిదండ్రులను, రాజకీయంగా ఎదగడానికి తోడ్పడిన పార్టీని విడిచి వచ్చిన కవిత, తెలంగాణ ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడు నిజంగా ప్రజల పట్ల నిబద్ధత ఉంటే అప్పుడే కొత్త పార్టీ స్థాపించాల్సిందని అన్నారు. ప్రస్తుతం రాజకీయ స్వార్థం, వ్యక్తిగత కారణాలతోనే ఈ పార్టీ ఏర్పాటైందని విమర్శించారు.
కవిత పార్టీ ఒక స్పష్టమైన లక్ష్యం లేదా ఆశయంతో ఏర్పడలేదని, అందువల్ల ఇది త్వరలోనే ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి, ఎంపీ, ఎమ్మెల్సీ హోదాలు, అలాగే లిక్కర్ కేసు వంటి అంశాల ద్వారా భారీగా ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ, వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పేరుపై స్పష్టత లేకపోవడం, రిజిస్ట్రేషన్ స్థితిపై అనిశ్చితి మధ్య ప్రజలను మోసం చేయవద్దని నరాల సత్యనారాయణ సూచించారు.
