ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో అవ్వాతాతల్లో ఆనందం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండల పరిధి 14 కండ్రిగ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. అర్హులైన లబ్ధిదారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ స్వయంగా పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఎమ్మెల్యే మురళీ మోహన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
షాదిమహల్ నిర్మాణానికి త్వరలో నిధులు
అనంతరం గ్రామంలో నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన షాదిమహల్ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. భవనం అసంపూర్తిగా ఉండటంతో ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్థులు వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, షాదిమహల్ నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మురళీ మోహన్ మాట్లాడుతూ, షాదిమహల్ పూర్తయితే పేద కుటుంబాలు వివాహాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మాధవరంలో కొత్త బోర్‌వెల్ ప్రారంభం
తదుపరి మాధవరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ బోర్‌వెల్ ద్వారా గ్రామంలో తాగునీటి సమస్యకు ఉపశమనం లభిస్తుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
వేసవి కాలంలో తాగునీటి కొరత ఎక్కువగా ఉండటంతో కొత్త బోర్‌వెల్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించి తమ సమస్యలను వినిపించారు.
