అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు అరెస్టు

అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు అరెస్టు

తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని వదిలివెళ్లి, అతని మృతికి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తొర్రూరు సీఐ గణేష్ తెలిపారు. గురువారం సీఐ గణేష్ మాట్లాడుతూ, తొర్రూరుకు చెందిన షేక్ బెబాని అలియాస్ పాషా అనే బైక్ మెకానిక్ మృతిపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా, పాషా తొర్రూరు కూరగాయల మార్కెట్ వెనుక ఉన్న సర్వీ వెంకన్నకు చెందిన బెల్ట్ షాప్‌లో అధికంగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ సమయంలో అతన్ని ఆస్పత్రికి తరలించకుండా, వెంకన్న, అతని భార్య లక్ష్మి, అక్కడ మద్యం తాగడానికి వచ్చిన ఖానాపురం గ్రామానికి చెందిన చందు, మరో గుర్తుతెలియని వ్యక్తి సహాయంతో సమీపంలోని కూరగాయల మార్కెట్‌లో వదిలి వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు.

ఈ ఘటనలో పాషా మృతికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాప్ నడిపిన నిర్వాహకులు, మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ యజమానులపై మరో మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గణేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply