Weekly-Installment : కంతుల కంత్రీలు..! Andhra Prabha Exclusive Story

Weekly-Installment : కంతుల కంత్రీలు..! Andhra Prabha Exclusive Story

  • రూ.10 వేలకు రూ.2300 భారం..
  • చిరువ్యాపారుల బతుకులు ఛిద్రం
  • బాండ్ల పై సంతకాలు
  • హామీదారులకు కమీషన్లు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఆర్థ‌వీడు)

కళ్లల్లో నీరసం.. సత్తువ కోల్పోయిన శరీరం నొప్పులతో వేదన భరిస్తోంది. మరోవైపు సూది పోట్లకు రక్తం చిమ్మిన మరకలతో సెలైన్ ఎక్కించే క్యాన్లా అమర్చిన చేత్తో గేర్లు మారుస్తూ అటో డ్రెవర్ బండి నడుపుతున్నాడు.. అవునూ! సేదదీరాల్సిన శరీరం ఎందుకు రోడ్డెక్కింది? బహుశా! వారాంతపు కంతులు కట్టాలి కాబోలు!
మానవీయ హృదయాలను చలింపజేసే, మదిని ఆలోచనల్లో ముంచెత్తే ఇలాంటి దృశ్యాలు అర్థవీడు మండలంలో తారసపడుతున్నాయి. చిరువ్యాపారుల, ఆటో కార్మికుల బతుకులను తడిమితే దినదినం పీల్చి పిప్పి చేస్తున్న వడ్డీ పింజరుల అమానుషమైన ధనదాహం కళ్లకు కడుతోంది.

Weekly-Installment : అసల్లో కోత – వడ్డీ మోత

మండలంలో వారపు కంతుల వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. రూ.10 వేలకు రూ.300 ముందుగానే మినహాయించి రూ.9,700 మాత్రమే రుణగ్రహీతకు ఇస్తున్నారు. బాండు మాత్రం రూ. 10వేలకు రాయించుకుంటున్నారు. వారానికి రూ.1,000 చొప్పున 12 వారాలు కంతుల రూపంలో చెల్లించాలి. అసల్లో మినహాయించిన రూ.300 హామీదారుకు చెల్లిస్తారు. ఈ మొత్తం కలిపితే రుణగ్రహీతపై అదనపు భారం రూ.2,300గా ఉంటుంది.ఈ తరహా రుణాలకు నెలకు నూటికి రూ.7 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు.

Weekly-Installment : ఆలస్యమైతే..

కంతు చెల్లింపులో ఒక్క రోజూ ఆలస్యమైనా అంతే! తొలుత హామీదార్లు ఒత్తిడి తెస్తారు. మలి దశలో రుణదాతలు అమ్మనా బూతులు లంకించుకుంటారు. చెవులు చిల్లు పడేలా, అవమాన భారంతో తలదించుకునే వరకూ బూతు పురాణం సాగుతోంది.

Weekly-Installment : ఆరోగ్యం తాకట్టు

బూతు పురాణం భరించలేక వారపు కంతు చెల్లించేందుకు మరోచోట అప్పు చేయాల్సి వస్తోందని ఓ ఆటో కార్మికుడు వాపోయాడు. ఇలా అప్పు తీర్చడం కోసం మరో అప్పు చేస్తూ దినసరి కూలీల బతుకులు అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. ఇంకొందరు ఏకంగా తమ ఆరోగ్యాన్నే తాకట్టు పెడుతున్నారు. జ్వరంతో ఓ కార్మికుడు వారం పాటు ఆటో తీయలేకపోయాడు. కంతు చెల్లించలేకపోయాడు. సెలైన్ ఎక్కించుకుంటూ ఆరోగ్యం స్థిర పరుచుకుంటున్నాడు. ఈ లోపు ” కంతు సంగతేంది. నా మాట పోగొడుతున్నావ్. మనోడివని డబ్బులు ఇప్పిస్తే ఎగొట్టడమే బహుమానమా? అంటూ హామీదారు మాటలను తూటాల్లా పేల్చాడు. అసలోడు వస్తే భరించలేని బూతులు వినాలి. ఆ అవమానం కంటే డబ్బులు ఇవ్వడమే మంచిదని క్యాన్ లా వున్నా బాడుగకు వెళ్ళా” అని ఓ ఆటో కార్మికుడు తన పరాధీనతను పలికాడు.

Weekly-Installment : పెద్ద నెట్ వర్క్

మండలంలో సుమారు 15 మంది వరకు ఈ తరహా వారపు కంతుల వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరు ఏలూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు చెందినవారని చెబుతున్నారు.కంభంలో నివాసం ఉంటూ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి లావాదేవీలు నిరాటంకంగా సాగేందుకు గ్రామాల్లో హామీదార్ల పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు వినిపిస్తోంది. వసూలైన వారపు కంతులనే తిరిగి కొత్త రుణాలుగా చలామణి చేస్తున్నారు. దినసరి ఆదాయం సంపాదించే చిరువ్యాపారులు, ఆటో కార్మికులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులైన టైలర్లు వారి టార్గెట్ గా వున్నారు. టర్నవర్ భారీ మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది.