ఇది నీకు.. ఇది నాకు..

అక్రమ నిర్మాణాల వెనుక భారీ స్థాయి ముడుపులు..
వసూళ్లే లక్ష్యంగా అధికారులు ముందుకు..
చర్యలు తీసుకోకుండా చదివింపులా..?


నిఘా విభాగం, ఆంధ్రప్రభ : అధికారుల ధనదానికి జిల్లా కేంద్రమైన భీమవరం సమస్యల వలయంగా మారుతుంది. వారి జోబులు నింపుకోవడానికి ప్లానింగ్ లేని పట్టణంగా జిల్లా కేంద్రాన్ని మార్చేస్తున్నారు. భీమవరంలో టౌన్ ప్లానింగ్ అధికారుల ఉదాసీనతతో అక్రమ భవనాలు వెలుస్తున్నాయి. ప్లాన్‌కు సంబంధం లేకుండా నిర్మాణాలకు లంచాలతో రక్షణ రేఖలు గీస్తున్నారు. భీమవరంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రభ వరుస కథనాలతో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, టౌన్ ప్లానింగ్ నియమాలు పూర్తిగా తుంగలో తొక్కుతూ రూ.కోట్లను గడిస్తున్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి ఎన్ని నియమాలు, సెట్‌బ్యాక్‌లు, ప్లాన్ అప్రూవల్‌లు ఉన్నా.. ఇక్కడ అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. అక్రమాలన్నిటిని సక్రమమే అంటూ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు.

అక్రమాలు కోకొల్లలు
భీమవరంలో ఏ ప్రధాన మార్గంలో చూసుకున్న అక్రమ భవన నిర్మాణాలే దర్శనమిస్తుంటాయి. ఈ అక్రమ భవన నిర్మాణాల వెనుక నడిపించేది అంతా వాటిని నియంత్రించాల్సిన అధికారులనేది బహిరంగ రహస్యం. వారి ధనార్జన కోసమే ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. కనీస నిబంధనలు కూడా పట్టించుకోకపోయినా పర్వాలేదు మా జేబులు నింపితే చాలు అన్న రీతిలో ఇక్కడ అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది. ఇక్కడి అధికారులను నియంత్రించాల్సిన పై అధికారులు కూడా వీరికి కొమ్ము కాయడం ఎక్కడా చూసి ఉండరు. తమను ఏ అధికారి నియంత్రించలేరని తమకు అన్ని రకాల అండదండలు కొందరి నుంచి ఉన్నాయని వారి బహిరంగ చెబుతున్నారంటే ఎంత బరితెగింపు తెగబడ్డారనేది తెలుస్తుంది.

టౌన్ ప్లానింగ్ అధికారులకు సమర్పించే కాగితాల్లోని నిర్మాణానికి వాస్తవ నిర్మాణాలకు ఏమాత్రం సంబంధం లేకుండా పనులు కొనసాగుతున్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్‌తో కమర్షియల్ భవనాలు నిర్మించినా కన్నెత్తి చూడని పరిస్థితి. రోడ్లు ఆక్రమించి, రిజర్వ్‌డ్ స్థలాలు, ఓపెన్ స్పేస్‌లు ఆక్రమణకు గురికావడం, సెట్‌బ్యాక్‌లు పాటించకపోవడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ మౌనం వహిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్‌లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు విషయంలో లొసుగులు కోకొల్లలుగా ఉన్నాయి.

నోటీసులే.. చర్యలు ఉండవు
భీమవరంలో అక్రమ నిర్మాణాల పై ఏమైనా ఫిర్యాదులు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధిత భవన యజమానులకు ఇక్కడ అధికారులు నోటీసులు మాత్రం జారీ చేస్తారు. వారి నుంచి వివరణ కూడా కోరుతారు అంతేకానీ వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమాత్రం కనిపించవు. అక్రమ నిర్మాణాలపై తక్షణ సమగ్ర సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న అటువంటి చర్యలు ఇక్కడ కనిపించవు. ఫిర్యాదులు వస్తే నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టడం ఇక్కడ అలవాటు. నిర్మాణ దశలోనే నిబంధనలు గాలికొదిలేసి అడ్డుగోలుగా భవనాలు నిర్మించే వారికి పూర్తి సహాయం అందించేస్తున్నారు.