ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్


పెనుకొండ, ఆగస్టు 12 (ఆంధ్రప్రభ): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. పలువురు వినతిపత్రాలను సమర్పించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా వ్యక్తిగత, స్థానిక సమస్యలను మంత్రి సవిత సావధానంగా విని, వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హత మేరకు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండటంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.