హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా మిస్‌వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణలో సందర్శించిన పలు ప్రాంతాల ఫోటోలను ఆయన షేర్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ సుందరీమణులు రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజుకో ప్రదేశం సందర్శిస్తున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, నాగార్జునసాగర్ వద్ద ఉండే బుద్దవనం, జూబ్లీహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయాన్ని అందాల భామలు సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం.. భవిష్యత్ తరాలకు నిలువెత్తు నిదర్శనం. ఎవరు అవునన్నా, కాదన్నా.. తెలంగాణ అభివృద్ధి చిహ్నాలు అవి, బీఆర్ఎస్ పాలన కీర్తి కిరీటాలు చెరిపేస్తే చెరిగేవి కావు, దాచేస్తే దాగేవి కావు. జై కేసీఆర్, జై తెలంగాణ’ అంటూ హరీశ్ రావు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం దీనిపై స్పందిస్తున్నారు. నిన్నటి వరకు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని అన్నారు.. నేడు అవే కేసీఆర్ ఆనవాళ్లు రేవంత్ సర్కార్ కు దిక్కైందని, కేసీఆర్ ఆనవాళ్ల ముందు ప్రపంచ సుందరీమణులు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.