ఉపాధి కూలీలకు రూ.312 వేతనం.. 125 పని దినాలు

వీబీజీ–రామ్‌జీ పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి

బంగారుగూడెంలో పామ్ ఆయిల్ మొక్కలు నాటిన కలెక్టర్.. రైతులకు అవగాహన

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : వీబీజీ–రామ్‌జీ పథకంలో ఉపాధి కూలీలకు దినసరి వేతనాన్ని రూ.312కు పెంచినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ రోజ్‌గార్ గ్యారంటీ–అభిజికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ–రామ్‌జీ) పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆమె గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

కార్యక్రమానికి ముందు రైతు బొట్టా నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్, పామ్ ఆయిల్ మొక్కలను నాటారు. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌)గా అమలైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించి 2026 జూలై 1 నుంచి వీబీజీ–రామ్‌జీ పేరుతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 పనిదినాలు కల్పించడంతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.312కు పెంచినట్లు వివరించారు.

గ్రామీణాభివృద్ధి, జీవనోపాధి, సహజ వనరుల పరిరక్షణ, విపత్తుల నివారణకు సంబంధించి మొత్తం 318 రకాల పనులు ఈ పథకం ద్వారా చేపట్టవచ్చని ఆమె తెలిపారు. వాటిలో నీటి భద్రతకు 107 పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాలకు 90 పనులు, జీవనోపాధికి 86 పనులు, విపత్తుల నివారణకు 35 పనులు ఉన్నాయని వివరించారు.

ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహకాలు అందిస్తోందని, రైతులు తమ భూముల పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్, కొబ్బరి, మామిడి, దానిమ్మ, నిమ్మ, సీతాఫలం, నేరేడు, సపోటా, చింత, మునగ వంటి పంటలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొబ్బరి తోటల్లో అంతర పంటలకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.

మునగ ఆకుల పొడి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ కలిగి ఉందని, పోషక విలువల దృష్ట్యా రైతులు మునగ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి అంచనాలు సిద్ధం చేసుకుని పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్. అప్పారావు, ఆర్డీవో మన్నే సూర్యారావు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి పి. శ్రీలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.