తెలంగాణ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుమన్ రాథోడ్ అన్నారు.
మంగళవారం 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ వినాయక్ చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఉట్నూర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సుమన్ రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, మాజీ జెడ్పీటీసీ సాడిగే గంగన్న, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి రాథోడ్ శేషారావు, సీనియర్ నాయకుడు కొమ్ము రామచందర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బొడ్డు కిరణ్, మండల కార్యదర్శి కాలువ రవి, పులి శ్రీకాంత్, పందిరి భీమన్న, చింతల రమణ, ఉగ్గే విజయ్, ఉరవకొండ శ్రీనివాస్, దేశాని సంతోష్, చరణ్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
