నంద్యాల బ్యూరో, మే 16 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు కార్యాలయంలో కూర్చుంటే పనులు ఎట్లా సాగుతాయని, ఫీల్డ్ వర్క్ చేయాలని, ఆస్తిపన్ను బకాయిలు వసూలు చేయాలంటూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ పి.సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచర్లకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, సెక్షన్ హెడ్ లతో, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బందితో, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
నంద్యాలలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో 80శాతం పన్నులు వసూళ్లు చేస్తే, నంద్యాలలో 60శాతం వసూలు కావడానికి కారణం ఏంటని సిబ్బందిని, కౌన్సిలర్లను కమిషనర్ ప్రశ్నించారు. అలాగే చెత్త సేకరణ ప్రక్రియపై మున్సిపల్ ఉన్నతాధికారులపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి పన్నులు 34కోట్ల రూపాయల్లో రాష్ట్ర స్థాయిలో సగటు 80శాతం కంటే తక్కువ వసూలు కావటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది లేరంటే కుదరదన్నారు. మీ పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిషనర్లు, అధికారులు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.