Review | హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ – ప్యూచ‌ర్ సిటిలో అండ‌ర్ గ్రౌండ్ ప‌వ‌ర్ కేబుల్స్: రేవంత్ రెడ్డి

ఔట‌ర్ రింగ్ రోడ్డులో సోలార్ విద్యుత్ కు ప్ర‌ణాళిక‌లు
ఆ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ ఉండ‌కూడ‌దు
విద్యుత్ శాఖ స‌మీక్ష స‌మావేశంలో రేవంత్ సూచ‌న‌లు

హైదరాబాద్ -గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్, నెక్లస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలన్నారు. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. విద్యుత్ శాఖపై సీఎం నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్లలో విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదన్నారు. హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని సూచించారు.

ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగబోతోందని అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలు, రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ లో డేటా సెంటర్ …
భవిష్యత్ లో హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవడం, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలన్నారు.

పెరిగిన విద్యుత్ వాడకం
గత ఏడాదితో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. 2025-26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని అది 2034- 35 నాటికి 31,808 మెగావాట్ల డిమాండ్ కు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే జిరో కరెంట్ బిల్లులను అర్హులైన వారికి ప్రతి నెల అందజేయాలని అంటూ, వారికి కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *