ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ మాట్లాడుతూ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,800 కోట్ల మేర పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం బకాయిల చెల్లింపులో జాప్యం చేయడంతో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులపై పెండింగ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆరోపించారు. చదువు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గోలేటి అజయ్, అభిషేక్, మండల నాయకుడు రామ్చరణ్ తేజతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
