రేపు లార్డ్స్‌లో ఫైనల్ ఫైట్.. టీమిండియా రికార్డు ఎలా ఉంది?
- భారత్‌కు పరీక్ష..
- క్రికెట్ మక్కాలో సిరీస్ కోసం సమరం..
- టీమిండియా రికార్డు ఏం చెబుతోంది?
ఆంధ్రప్రభ : ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు లార్డ్స్ మైదానంలో జరిగే మూడో, చివరి వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. దీంతో లార్డ్స్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో విజేతే సిరీస్‌ను సొంతం చేసుకోనుంది.
అయితే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో…. భారత్ రికార్డు ఆశించిన స్థాయిలో లేదు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ ఇక్కడ 31 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, కేవలం 7 విజయాలు మాత్రమే నమోదు చేసింది. 19 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో భారత్ విజయశాతం 22.58 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అదేవిధంగా లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 8 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 3 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 4 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
చివరిసారిగా 2022 జూలై 14న లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో భారత్ 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు. అయితే లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు విఫలమై 146 పరుగులకే ఆలౌటయ్యారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తలా 29 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ ఆరు వికెట్లతో భారత్‌ను కట్టడి చేశాడు.
లార్డ్స్‌లో భారత్ తరఫున టాప్ ప్రదర్శనలు
వన్డేల్లో లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలిచాడు. ఆయన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 208 పరుగులు చేశాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ (170), మహేంద్రసింగ్ ధోనీ (165), రాహుల్ ద్రావిడ్ (149), సురేశ్ రైనా (130) ఉన్నారు.
బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, ఆర్‌పీ సింగ్ తలా ఐదు వికెట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వారి తర్వాత మొహిందర్ అమర్‌నాథ్, జహీర్ ఖాన్, మదన్ లాల్ తలా నాలుగు వికెట్లు తీశారు.
ఇప్పటికే సిరీస్ సమంగా ఉండటంతో లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ప్రతికూల గణాంకాలను అధిగమించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, స్వదేశంలో మరోసారి లార్డ్స్ విజయాన్ని అందుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
