యాదాద్రి , తిరుమల అనుగ్రహ జయపతాకమే పురాణపండ పుస్తకం !

  • భాగ్యనగర పుస్తకాల జాతరలో పలువురు ప్రముఖులతో శ్రీమాలిక !!

హైదరాబాద్ : మూడురకాల మనోహర లావణ్యమైన ముఖ పత్రాలతో, నాలుగు వందల పేజీల వైదిక వెలుగులతో, పవిత్ర సౌందర్యాల వ్యాఖ్యానాలతో , మరీ ముఖ్యంగా పరమాద్భుతమైన శైలితో నృసింహావతార ఆవిర్భావఘట్ట ఆవిష్కరణతో వేల వేల పాఠకుల్ని రోజు రోజుకీ ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ ముప్పై నాలుగవ దైవీయ గ్రంధం ‘ శ్రీమాలిక ‘ ఉపాస్య సాధనల ప్రార్ధనా గ్రంధంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అన్ని వర్గాలనూ ఆకర్షించి కరదీపికగా నిలవడం పుస్తక వేడుకలోలో చర్చనీయాంశంగా నిలిచింది.

మంగళవారం సాయంకాలం పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన కవిత్వ సాహిత్య ఆధ్యాత్మిక ప్రముఖులైన గోరటి వెంకన్న, దైవజ్ఞ శర్మ , మహిళా రచయిత్రులు గౌరీలక్ష్మి, రేణుక అయోల, అత్తలూరి విజయలక్ష్మి, శీలా సుభద్ర, సంధ్యారెడ్డి, కోగంటి ఉషారాణి, రాణి, పద్మ, జయశ్రీలు ఈ శ్రీమాలిక మంత్ర శోభను ప్రశంసించి , పారాయణకు, ప్రార్థనకు ఈ బుక్ ఒక మహా సాధనగా అందడం అదృష్టంగా పేర్కొన్నారు. లేఖిని రచయిత్రుల వేదిక ప్రధాన కార్యనిర్వాహక వర్గంలో కీలకమైన కాఫీ విత్ కామేశ్వరి రచయిత్రి సీహెచ్ కామేశ్వరి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు.

పీఠాధిపతుల , మఠాధిపతుల , మహా పండితుల , కవుల , రచయిత్రుల రచనల్లో ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ మంత్రపేటిక శ్రీమాలిక మాత్రమే ఎక్కువ శాతంగా అమ్ముడుపోవడం గమనార్హం. ఎనిమిది స్టాల్స్ లో దొరుకుతున్నఈ పుస్తకం వందలాది పాఠకుల చేతుల్లో పరమ పవిత్ర హస్తభూషణమై సాయం రాత్రి వేళల్లో బుక్ ఫెయిర్ ప్రధాన ద్వారం దాటడం విశేషమే !

ముఖ్యంగా వ్యాపార కనికట్టు లేకుండా ఒక యజ్ఞ భావనతో ఈ బుక్ నిర్మాణాత్మకంగా భక్తితో అందడం వల్లనే తాము ఈ బుక్ వైపు మొగ్గు చూపినట్లు పలువులు భక్త పాఠకులు మీడియా ప్రతినిధులతో బాహాటంగా చెప్పడం ఎన్ఠీఆర్ స్టేడియంలో స్పష్టంగా కనిపించింది.

గతంలో పురాణపండ శ్రీనివాస్ ఏడువందల పేజీల అమ్మవారి అక్షర చైతన్యం శ్రీపూర్ణిమ దివ్య గ్రంధానికి కూడా ఇంత డిమాండ్ వచ్చినట్లు, ఇప్పటికీ ఆ గ్రంధాన్ని పలువురు పాఠకులు అడుగుతున్నట్లు పలువురు బుక్ స్టాల్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర మహాసరస్వతి స్వామివారి మంగళాశాసనాలతో తొలి ప్రచురణగా తెలుగువారికి పదహారు నెలల క్రితం అందిన శ్రీమాలిక గ్రంధం ఇప్పటికి ఇరవై ఐదు ప్రచురణలకు నోచుకోవడం మామూలు విషయం కాదని , పురాణపండ శ్రీనివాస్ నిరన్తర సరస్వతీ సాధనకు జయ పతాకమని యాదాద్రి ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు గతంలో అనుగ్రహించడాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించారు.