ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ముప్పు శ్రీనివాస్
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పెంచికలపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ముప్పు శ్రీనివాస్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని వర్గాలను కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. భవిష్యత్తులో ఎల్కతుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొన్నం అనూప్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
