న్యూ ఢిల్లీ – భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ జామా మసీదు 13వ షాహీ ఇమామ్ అయిన అహ్మద్ బుఖారీ మనవడు సయ్యద్ అరీబ్ బుఖారీ.. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గాను ప్రధాని మోదీని ‘మామా’ అని సంబోధిస్తూ ఆయనకు, భారత దళాలకు అరీబ్ బుఖారీ ధన్యవాదాలు తెలిపాడు.
ఉద్రిక్తతలతో భయపడ్డాను
భారత్, పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా తాను ఎంతో ఆందోళనకు, భయానికి గురయ్యానని అరీబ్ బుఖారీ తన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. “మోదీ మామా.. ఉగ్రవాదంపై మీరు గట్టి చర్యలు తీసుకున్నారు. చేతల్లో దానిని చూపించారు. మీరే మా హీరో” అని ఆయన ప్రధానిని ఉద్దేశించి అన్నాడు. భారత ప్రభుత్వం, మన ధైర్యవంతులైన జవాన్ల చర్యతో ఇప్పుడు తాను మళ్లీ చదువుపై దృష్టి పెట్టగలనని పేర్కొన్నాడు. “భారత ప్రభుత్వానికి, మన వీర జవాన్లకు ధన్యవాదాలు. జై హింద్” అని అరీబ్ తన సందేశాన్ని ముగించాడు.