TGSRTC Merger | ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా కసరత్తు

TGSRTC Merger | ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా కసరత్తు
TGSRTC Merger | పారదర్శక విధానంతో ఉద్యోగుల వివరాల పరిశీలన
ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం అంచనా
ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆశలు
జూన్ 2 నాటికి విలీన ప్రక్రియకు రూపురేఖలు
TGSRTC Merger | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఉద్యోగులను పూర్తి స్థాయి ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించే దిశగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, ప్రత్యేక అధ్యయన కమిటీ వేగంగా కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికి విలీన ప్రక్రియకు స్పష్టమైన రూపురేఖలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న దాదాపు 37,360 మంది ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ఉద్యోగుల సేవా భద్రత, వేతన పరిరక్షణ, పదవీ విరమణ ప్రయోజనాలు, మెడికల్ సదుపాయాలపై స్పష్టత ఇవ్వాలని సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.
పారదర్శక విధానంపై దృష్టి
విలీన ప్రక్రియలో ఎలాంటి పైరవీలు, రాజకీయ ఒత్తిడులు, వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి బృందం విభాగాలవారీగా ఉద్యోగుల వివరాలు, సర్వీస్ రికార్డులు, సీనియారిటీ, కేడర్ నిర్మాణం, వేతన భత్యాలు, పెన్షన్ అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది.
ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగుల సేవా నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలకు అనుగుణంగా మార్చే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగుల హోదాలు, కేడర్ పునర్వ్యవస్థీకరణ, ప్రమోషన్ విధానం, భవిష్యత్ నియామకాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
ఆర్థిక భారం – ప్రభుత్వ అంచనాలు
ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశమున్నప్పటికీ, దీర్ఘకాలంలో సంస్థకు స్థిరత్వం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విలీనంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ. వెయ్యి కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఆస్తులు మాత్రం ఆ సంస్థ పరిధిలోనే ఉండనున్నాయి.
ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న అప్పులు, డీజిల్ వ్యయం, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాల భారం వంటి అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక విలీనానంతరం ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా ద్వారా నేరుగా జీతాలు చెల్లించే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో భవిష్యత్‌పై ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగుల్లో ఆశలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం డిమాండ్ కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, వేతన ఆలస్యాలు, ఉద్యోగ భద్రతపై అనుమానాలు నేపథ్యంలో ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతోంది. విలీన ప్రక్రియ పూర్తి అయితే రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఇది కీలక నిర్ణయంగా నిలిచే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ విలీన కమిటీ నియామకం జరిగిన వారం, పది రోజుల్లో విలీనానికి సంబంధించిన విధివిధానాలపై తుది నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ కమిటీని ప్రభుత్వం కోరింది. ఈ నెలాఖరులోపు దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేసి తుది నిర్ణయానికి రానుంది.
