Ghost SIM Scam | ‘అక్టోపస్ ఆపరేషన్-3’తో సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం

Ghost SIM Scam | ‘అక్టోపస్ ఆపరేషన్-3’తో సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం

Ghost SIM Scam | 13 రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు.. 66 మంది అరెస్ట్
ఘోస్ట్ సిమ్లతో రూ.101 కోట్ల సైబర్ మోసం
ఈ-సిమ్‌ల ద్వారా విదేశాల నుంచి మోసాలు
కేవైసీ నిబంధనలను కఠినతరం చేయనున్న పోలీసులు

Ghost SIM Scam | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సైబర్ నేరాలకు కీలకంగా మారిన ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. ఈ ఘోస్ట్ సిమ్‌లకు సంబంధించి పోలీసులు ‘అక్టోపస్ ఆపరేషన్-3’ పేరుతో ఏడు రోజుల పాటు 13 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 66 మందిని అరెస్టు చేశారు. దాదాపు 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

76 సైబర్ నేరాల్లో ఘోస్ట్ సిమ్‌లతో దాదాపు రూ.101 కోట్ల నగదును కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. వినియోగదారులు ఎవరైనా సిమ్ కార్డులను తీసుకోవడానికి వచ్చినప్పుడు సర్వర్ డౌన్ ఉందని, ఇతర సాంకేతిక కారణాలను చెప్పి వారి వద్ద నుంచి మొత్తంగా రెండు, మూడు బయోమెట్రిక్స్‌ను తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి మరీ సిమ్‌లను తక్కువ ధరకు ఇస్తున్నట్లు, ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారం చేసి అమాయకుల నుంచి బయోమెట్రిక్స్‌ను అదనంగా సేకరిస్తున్నారు.

ఆ తర్వాత వాటిని సైబర్ నేరగాళ్లకు కమీషన్ల మీద విక్రయిస్తున్నారు. మరికొందరు ఇలా తీసుకున్న సిమ్‌లను యాక్టివేట్ చేసి వాటిని ఈ-సిమ్‌లుగా మార్చేసి విదేశాల్లో ఉండే సైబర్ నేరగాళ్లకు పంపిస్తున్నారు. ఇలా ఇండియన్ నెంబర్లతో విదేశాల నుంచి టెలిగ్రామ్, వాట్సాప్‌లను యాక్టివేట్ చేసుకుని క్రిమినల్స్ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

ఫేక్ ప్రొఫైల్స్‌తో బురిడీ కొట్టించడంతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ పంపించి బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ లక్షలు, కోట్లు డిమాండ్ చేస్తూ దోచేస్తున్నారని తేలింది. ఈ-సిమ్‌లతో డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఇంకా అనేక సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని స్పష్టమైంది.

ఘోస్ట్ సిమ్‌లతో 101 కోట్లు మింగేశారు

అక్టోపస్-3లో పోలీసులు జరిపిన సోదాల్లో మొత్తం 544 సిమ్ కార్డులు దొరికాయి. 66 మందిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు ఇచ్చిన సిమ్ కార్డులతో దాదాపు 76 సైబర్ కేసుల్లో రూ.101 కోట్లను విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు కొట్టేశారని తేలింది.

అంతకు ముందు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వద్ద నమోదైన కేసుల్లో మొత్తం 1194 ఘోస్ట్ సిమ్‌లతో మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడ్డారని తెలుసుకుని సైబర్ క్రైం పోలీసులు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు.

అరెస్టైన నిందితుల్లో పీఓఎస్ ఏజెంట్లు వొడాఫోన్-ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు 7 మంది, జియోకు చెందిన వారు 3 మంది ఉన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి నేతృత్వంలోని టీంలను సీపీ సజ్జనార్ అభినందించారు.

ఈ ఆపరేషన్‌లో వెలుగు చూసిన అంశాలు, లోపాలకు సంబంధించి రానున్న రోజుల్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతామని పోలీసులు తెలిపారు. పోలీసు దర్యాప్తులో బయటపడ్డ లోపాలను ట్రాయ్, డీఓటీ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాయడంతో పాటు సిమ్ కార్డును పొందేందుకు అవసరమయ్యే కేవైసీ ప్రక్రియను మరింత కఠినంగా చేయాలని సూచిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply