Online Betting | వృద్ధురాలిని బావిలోకి తోసేసిన విద్యార్థి

రూ.4 లక్షలు నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్న యువకుడు..
పని ఇప్పిస్తానని నమ్మించి బంగారం దోచుకున్న దారుణం
21 గంటల పాటు బావిలో ప్రాణాలతో పోరాడిన వృద్ధురాలు..
సీసీటీవీ, ర్యాపిడో వివరాలతో నిందితుడి అరెస్ట్

Online Betting | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల వ్యసనం మరో ఘోరానికి దారితీసింది. అప్పులు తీర్చేందుకు డబ్బు కోసం ఓ డిగ్రీ విద్యార్థి వృద్ధురాలిని పని ఇప్పిస్తానని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నగలు దోచుకుని బావిలోకి తోసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. సీసీటీవీ దృశ్యాలు, ర్యాపిడో బుకింగ్ వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి (21) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు బానిసైన అతడు దాదాపు రూ.4 లక్షలు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల నుంచి బయటపడేందుకు లోన్ యాప్‌ల ద్వారా డబ్బు తీసుకోగా, రుణం చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 1వ తేదీన కరీంనగర్‌లోని లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం వేచి ఉన్న గంగాధర లక్ష్మి అనే వృద్ధురాలిని దినేష్ రెడ్డి సంప్రదించాడు. తనకు తెలిసిన చోట పని ఇప్పిస్తానని నమ్మించి నసుల్తాపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వృద్ధురాలి వద్ద ఉన్న అర తులం బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను లాక్కొని, ఆమెను సమీపంలోని బావిలోకి తోసివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో వృద్ధురాలు బావిలోనే చిక్కుకుపోయింది.

దాదాపు 21 గంటల పాటు బావిలో ప్రాణాలతో పోరాడిన వృద్ధురాలి అరుపులు మరుసటి రోజు ఉదయం స్థానిక గ్రామస్తులు విని వెంటనే ఆమెను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థల పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు, నిందితుడు ఉపయోగించిన ర్యాపిడో బుకింగ్ వివరాలు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో కరీంనగర్ అమరవీరుల స్తూపం సమీపంలో దినేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో దోచుకున్న బంగారాన్ని కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ఉన్న బంగారం వ్యాపారి వేణు మనోహరాచారికి విక్రయించి సుమారు రూ.30 వేల నగదు తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో బంగారం కొనుగోలు చేసిన వ్యాపారినీ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ వ్యసనం యువతను ఎంత ప్రమాదకరమైన మార్గంలోకి నెడుతోందో మరోసారి స్పష్టమైందని పోలీసులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.