TG | కలెక్టర్ కార్యాలయంలో.. కాలుష్యం బాధితులు..

TG | కలెక్టర్ కార్యాలయంలో.. కాలుష్యం బాధితులు..
TG, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమల కాలుష్యాన్ని నివారించి తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. గ్రామ సమీపంలోని హజేలో, శ్రీ జయ, బృందావన్, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్, విజె సాయి, ఎస్ వి ఆర్ లాబరేటరీస్, ఆర్కిమెడిస్, రావుస్ లేబరేటరీస్ తదితర పరిశ్రమలు చేయు వాయు, జల, భూకాలుష్యం కారణంగా మా గ్రామ ప్రజలు చర్మ రోగాలు, కళ్ల మంట, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, జన్యు సంబంధమైన దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.
ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా, గ్రామ ప్రజల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం, వ్యవసాయ రంగానికి, గ్రామ రైతులకు జరుగుతున్న నష్టాన్ని పీసీబీ అధికారులు గుర్తించి కేవలం కొద్ది రోజులు మాత్రమే కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, రూ. 5.44 కోట్ల వరకు ఎన్విరాన్మెంట్ కాంపిన్సేషన్ విధించారు. పరిశ్రమల వల్ల మా గ్రామ పరిసరాలలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై ఉన్నందున, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం, పరిశ్రమల నుండి వసూలు చేసిన ఎన్విరాన్మెంటల్ కాంపిన్సేషన్ ధనాన్ని ఉపయోగించి రే్మీడియేషన్ ఆఫ్ కాంటమినేటెడ్ సైట్స్ లో భాగంగా పిల్లాయిపల్లి కాలువ నుండి ఎత్తిపోతల ద్వారా మా గ్రామ వ్యవసాయ భూములకు సాగునీరు అందించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమలు నిరంతరాయంగా వాయు కాలుష్యానికి పాల్పడుతున్నందున కాలుష్యాన్ని గుర్తించుట కొరకు గ్రామ సమీపంలో పరిశీలన యంత్రంను ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమలు చేసిన భూగర్భ జలాల కాలుష్యం కారణంగా, మా గ్రామ రైతుల పంటలు పండక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ విషయాన్ని గుర్తించిన పీసీబీ మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి కార్యాలయానికి నష్టపరిహారం విషయమై పరిశీలించుటకు లేఖలు అందజేశారు. కానీ ఈ రోజు వరకు మా గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.
ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా దశాబ్ద కాలం పైగా నష్టపోయిన మొత్తాన్ని సంబంధిత బాధ్యులైన పరిశ్రమల యాజమాన్యం నుండి పూర్తి స్థాయిలో పరిహారంగా ఇప్పించాలని, ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పటి నుండి సంవత్సరాల తరబడి పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తూ.. యధావిధిగా కాలుష్యానికి పాల్పడుతూనే ఉన్నందున ఈ పరిశ్రమలను ఇక్కడ నుండి శాశ్వతంగా తరలించాలని బాధితులు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో వస్పరి శారదమ్మ, ప్రభ, సత్తమ్మ, రావుల శ్రీనివాస్ రెడ్డి, రావుల బాల్ రెడ్డి, నరసింహ, దామోదర్ రెడ్డి తదితర బాధితులు ఉన్నారు.
