గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న దామోదర
వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వసతి కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని గురుకులాలు పరీక్షలు రాసే విద్యార్థులకు భోజన, వాహన వసతులు కల్పిస్తున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో విషయాన్ని జై భీమ్ యూత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీహరి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని, సిబ్బందిని సైతం బానిసల కంటే హీనంగా చూస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి సొసైటీ సెక్రటరీ వర్షిణికి ఫోన్‌చేసి వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి నివేదిక అందివ్వాలని ఆదేశాలు జారీ చేశారు.