ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
– తెలంగాణ ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ డిమాండ్
మోత్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి, ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల మనుగడను కాపాడాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి రావాల్సిన ఫీజు బకాయిలు సకాలంలో అందకపోవడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన హెచ్చరించారు.
మహాత్మా గాంధీ అసోసియేషన్ అధ్యక్షులు టి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాలల సమగ్ర అభివృద్ధి, పరిపాలనా అంశాలు , విద్యార్థుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాన కార్యదర్శి సి.హెచ్. సత్యం గౌడ్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించగా, కోశాధికారి ఎస్. హన్మంతు యాదవ్ కళాశాలల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించారు. భవిష్యత్తులో ప్రైవేట్ కళాశాలల ఉనికి ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే యాజమాన్యాలన్నీ ఐక్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.
“కష్టకాలంలో మనోధైర్యం కోల్పోవద్దు.. మేధావులను తయారు చేసే విద్యాసంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని యాజమాన్యాలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ నరసింహారెడ్డి, బి. శంకర్, మల్లేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, నవీన్, నాగయ్య, ఆంజనేయులు తదితర ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సభ్యులు మరియు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
