రాష్ట్రానికే రోల్ మోడల్ ఈసీఆర్ విద్యా విధానం…

రాష్ట్రానికే రోల్ మోడల్ ఈసీఆర్ విద్యా విధానం…
- ప్రతి విద్యార్థి చదవాలనే ప్రణాళికతో ప్రాథమిక విద్యపై అనుదీప్ ముద్ర .
- చిన్నారులకు ఇంగ్లీష్ పై అమితాసక్తి పెంచిన ఈ సి ఆర్.

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆంగ్లంపై పట్టు పెంచేందుకు ఈసిఆర్ విద్యా ప్రణాళిక రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచింది. రాష్ట్ర అధికారిగా పదోన్నతి పొందిన ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న ఎవరీ చైల్డ్ రీడ్స్ విధానం జిల్లావ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల చిన్నారుల్లో ఇంగ్లీష్ పై ఉన్న భయాన్ని పోగొట్టి ఇంగ్లీష్ అంటే అమితాసక్తి పెంచేలా చేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఈసిఆర్ పద్ధతి దృఢ సంకల్పంతో పటిష్టంగా అమలు చేయడం ప్రాథమిక పాఠశాల చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపింది.
అనుదీప్ దురిశెట్టి ఆలోచనలో పుట్టి, కార్యాచరణలో విజయవంతమైన మహత్తర విద్యా సంస్కరణ కార్యక్రమం ఎవరీ చైల్డ్ రీడ్స్. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పెంచడం, ముఖ్యంగా ప్రతి చిన్నారి ఆంగ్లంలో అనర్గళంగా చదవగలగడం అనే ఉన్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అది వేలాది పేద పిల్లల భవిష్యత్తును వెలిగించిన విద్యా దీపం.
ఫొనిక్స్ సహాయంతో అక్షరాల బోధన, శబ్దాల ద్వారా పదాల నిర్మాణం, పదాల ద్వారా వాక్యాలు చదవడం వంటి శాస్త్రీయ విధానంతో కలెక్టర్ అనుదీప్ స్వయంగా రూపొందించిన మాడ్యూల్ ద్వారా చిన్నారుల్లో చదవగలిగే నైపుణ్యం ఆశ్చర్యకరంగా పెరిగింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ఆదేశాల స్థాయిలో కాకుండా, అత్యంత క్రమశిక్షణతో అమలు చేయించడంలో కలెక్టర్ అనుదీప్ దూరదృష్టి స్పష్టంగా కనిపించింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ , జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని ద్వారా మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి పాఠశాలలో పర్యవేక్షణ జరిపేలా వ్యవస్థను రూపొందించారు.
ప్రతి వారం ఉపాధ్యాయులు తాము నేర్పిన అంశాలపై స్వయం మూల్యాంకనం చేసుకోవడం, యాప్‌ల ద్వారా జరిగిన అభివృద్ధిని కలెక్టర్ స్వయంగా పరిశీలించడం, తదనంతరం ఏసీఎల్ బి శ్రీజ , జెడ్పి సీఈవో దీక్షారైనా, సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం వారికి ఒక్కొక్కరికి ఏడు మండలాలను పర్యవేక్షణ చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేలా చేయడం ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా మార్చాయి. ఒక జిల్లా కలెక్టర్‌గా పరిపాలన చేయడమే కాదు, ఒక గురువుగా పిల్లల చదువుపై అంతటి శ్రద్ధ చూపడం నిజంగా అరుదైన విషయం.
ప్రస్తుతం ఈ కార్యక్రమం ఫలితంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 90 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో చదవగలుగుతున్నారు అంటే అది కేవలం గణాంకమే కాకుండా అది వేలాది కుటుంబాల ఆనందం, తల్లిదండ్రుల నమ్మకం, ఉపాధ్యాయుల కృషికి వచ్చిన గౌరవం. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారా లేదా అనే సందేహంతో ఉన్న తల్లిదండ్రులు, ఇప్పుడు తమ పిల్లలు ఇంగ్లీషులో చదివి వినిపిస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించే ఆనందం వర్ణించలేనిది. “మా బిడ్డ కూడా చదువుతున్నాడు” అని గర్వంగా చెప్పే తల్లిదండ్రుల మాటల్లో ప్రభుత్వ విద్యపై తిరిగి నమ్మకం పుట్టింది.
ఒకప్పుడు చదవడానికి సంకోచించిన పిల్లలు, ఇప్పుడు ధైర్యంగా పాఠాలు చదవడం; పాఠశాలకు రావడానికే ఆసక్తి చూపని విద్యార్థులు, ఇప్పుడు ముందుండి పాల్గొనడం, తమ పిల్లల చదువుపై ఆశలు కోల్పోయిన తల్లిదండ్రులు, ఇప్పుడు ఆశతో పాఠశాలకు రావడం, ఇవి అన్నీ ఈసిఆర్ కార్యక్రమం తీసుకొచ్చిన విజయవంతమైన పరిణామాలు. ఇది కేవలం విద్యా కార్యక్రమం కాదు, ఇది సమాజంలో ఆశను నింపిన మహోన్నత ప్రయత్నం. ఇలాంటి ఉత్తమ ఆలోచనతో పేద పిల్లల జీవితాల్లో వెలుగు నింపిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక అధికారిగా బదిలీ అయినప్పటికీ ఒక విద్యా సంస్కర్తగా ఆయన ముద్ర జిల్లాలో శాశ్వతంగా మిగిలిపోతుంది.
ఆయన ఆలోచనల విత్తనం ఇప్పుడు వేలాది చిన్నారుల భవిష్యత్తులో ఫలిస్తోంది. ఒక మంచి కలెక్టర్ పరిపాలన చేస్తాడు… కానీ ఒక గొప్ప కలెక్టర్ తరాల భవిష్యత్తును నిర్మిస్తాడు. అలాంటి ఉత్తమ వ్యక్తి అనుదీప్ దురిశెట్టి ఎప్పటికీ గుర్తుండిపోతారు. “పిల్లల చేతిలో పుస్తకం పెట్టినవాడు కేవలం అధికారి మాత్రమే కాదు , భవిష్యత్తును నిర్మించిన దార్శనికుడు అనుదీప్. ఈ సి ఆర్ విద్యా విధానం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినప్పుడు అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులకు దక్కుతాయి.
