నెలాఖరులో నూతన కలెక్టరేట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

నెలాఖరులో నూతన కలెక్టరేట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

కరీంనగర్, (ఆంధ్రప్రభ): కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ జిల్లా అభివృద్ధికి పరిపాలనా కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గతంలో ప్రారంభమైన కలెక్టరేట్ నిర్మాణ పనులు వివిధ కారణాలతో నిలిచిపోయాయని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక చొరవతో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయించారని తెలిపారు. ప్రభుత్వం సహకారంతో అన్ని ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వసతులు, ప్రజలకు అనుకూలమైన సేవా వ్యవస్థతో కలెక్టరేట్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని మంత్రి వెల్లడించారు. కలెక్టరేట్ ప్రారంభం అనంతరం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ హిత వాతావరణం, విశాలమైన కార్యాలయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వ్యవస్థతో ఈ కలెక్టరేట్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, ఆర్డీవో షర్మిల, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply