పోక్సో బాధితులకు సేవలందించడమే భరోసా కేంద్రాల లక్ష్యం

పోక్సో బాధితులకు సేవలందించడమే భరోసా కేంద్రాల లక్ష్యం

శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ:
పోక్సో (Pocso) కేసుల బాధితులకు తదుపరి మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ తగిన భద్రత కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “భరోసా సెంటర్”తో పాటు, ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అత్యాధునిక జిమ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, ఎల్‌.ఎస్‌. చాహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై హింస, వేధింపులు, లైంగిక దాడులకు గురైన బాధితులకు తక్షణ సహాయం, రక్షణ అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బాధితులకు ఒకేచోట వైద్యం, చట్టపరమైన సహాయం, మానసిక కౌన్సెలింగ్, పునరావాసం వంటి సేవలు అందించడం ద్వారా పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ అవసరమైన అన్ని సేవలను సమన్వయంతో అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.

సమాజంలో మద్యం సేవనం వల్ల అనేక కుటుంబ, సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంటూ ప్రజలు తమ అలవాట్లలో మార్పు తీసుకురావాలని సూచించారు. “హెల్త్ ఈజ్ వెల్త్” సూత్రాన్ని పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, శారీరక దారుఢ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని కోరారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే నల్లచెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్ద రెండు జిమ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ సహకారంతో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ జిమ్ ఏర్పాటు చేశామని, పోలీసులు, యువత ఈ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే వేదికపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్‌లో పోలీస్ జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం పోలీసు సిబ్బందికి నూతన క్యాప్స్‌ను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అదనపు ఎస్పీ రాజేష్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు బాలాజీ నాయక్, గిరి ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి ఇతర శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply