Saraswati River | కాళేశ్వరంలో రేప‌టి నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు

Saraswati River | కాళేశ్వరంలో రేప‌టి నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు

Saraswati River |తెప్పోత్సవం.. సాయంత్ర మహా హారతులు..
నిత్య హోమాలతో దివ్యక్షేత్రంగా కాళేశ్వరం
రేప‌టి నుంచి ప‌విత్ర‌ స్నానాల కోసం భ‌క్త జ‌నం రాక‌

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జ్ఞానానికి ప్రతీకగా భావించే సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తిశ్రద్ధల మధ్య జరగనున్నాయి. రేపు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, శ్రీ కంచి కామకోటి పీఠం కంచిపురం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఘనంగా పుష్కరాలను ప్రారంభించనున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహిస్తుందని విశ్వసించే సరస్వతీ నదుల త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం ఇప్పటికే ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అంత్య పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పుష్కర స్నానం, దేవస్థాన దర్శనం మాత్రమే కాకుండా త్రివేణి సంగమంలో నిర్వహించే తెప్పోత్సవం, ప్రతిరోజూ జరిగే గంగా హారతి తరహా దీపారాధనలు, సరస్వతి అమ్మవారి ప్రత్యేక పూజలు, మహా హోమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

జ్ఞానప్రదాయిని సరస్వతీ మహిమ
వేదాల్లో అత్యంత పవిత్ర నదిగా వర్ణించబడిన సరస్వతి నది జ్ఞానం, విద్య, వాక్పటుత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం హిమాలయాల్లో ఉద్భవించిన ఈ నది భూగర్భ మార్గంలో ప్రవహిస్తూ పలు ప్రాంతాల్లో అంతర్వాహినిగా కొనసాగుతుందని విశ్వాసం. తెలంగాణలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడ జరిగే సరస్వతి పుష్కరాలకు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. పుష్కర కాలంలో సరస్వతి స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని, విద్యాభివృద్ధి, జ్ఞాన ప్రాప్తి, మానసిక ప్రశాంతత లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఈ పుష్కర స్నానం చేస్తే విద్యా విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

దివ్య తెప్పోత్సవం..
పుష్కరాల్లో ప్రధాన ఆకర్షణగా త్రివేణి సంగమంలో నిర్వహించే తెప్పోత్సవం నిలవనుంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రత్యేక తెప్పపై దేవతామూర్తులను నదిలో విహరింపజేస్తూ నిర్వహించే ఈ కార్యక్రమం భక్తులకు కనులవిందు చేయనుంది. నదీ తీరంలో వేలాది మంది భక్తులు భజనలు, మంగళ వాద్యాల మధ్య ఈ వేడుకను వీక్షించనున్నారు. అలాగే ప్రతి సాయంత్రం త్రివేణి సంగమ నది ఒడ్డున ప్రత్యేక హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గంగా హారతిని తలపించేలా వేద మంత్రోచ్ఛారణలు, దీపారాధనలు, గంటానాదాల మధ్య జరిగే ఈ హారతులు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను మరింత పెంచనున్నాయి. ఈ హారతి కార్యక్రమానికి కాశీ నుండి ప్రత్యేకంగా వేద పండితులను రప్పించి నిర్వహిస్తున్నారు.

అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు
సంగమ నది ఒడ్డున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సరస్వతి అమ్మవారి విగ్రహానికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని విద్యా విజయాలు ప్రసాదించాలని ప్రార్థించనున్నారు. పుష్పాలంకరణలతో కళకళలాడే సరస్వతి మండపం భక్తులను విశేషంగా ఆకర్షించనుంది. ఇదే ప్రాంతంలో భారీ బాహుబలి సెట్‌ను నిర్మించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవతామూర్తులు, శిల్ప కళాఖండాలతో రూపొందించిన ఈ భారీ సెట్ పుష్కరాలకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాత్రివేళల్లో విద్యుత్ కాంతులతో ఈ ప్రాంతం మరింత దివ్యంగా దర్శనమిస్తోంది.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం విశేషం
త్రివేణి సంగమ ప్రాంతంలో వెలసిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ఈ దేవస్థాన ప్రత్యేకత. ఒకటి కాళేశ్వరుడిగా, మరొకటి ముక్తీశ్వరుడిగా భక్తుల పూజలను అందుకుంటున్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని, యమదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పుష్కరాల సందర్భంగా కాళేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

భక్తులను ఆకట్టుకుంటున్న మహా హోమాలు
పుష్కరాల సందర్భంగా వివిధ రకాల మహా హోమాలు నిర్వహించనున్నారు. ప్రతి హోమానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

ప్రధాన హోమాలు ఇవే…
మహాగణపతి హోమం – సకల విఘ్నాల నివారణార్థం
సుబ్రహ్మణ్య షడాక్షరి హోమం – సంతాన ప్రాప్తి, శత్రు బాధల నివారణ కోసం
హయగ్రీవ హోమం – విద్యాభివృద్ధి, జ్ఞాన ప్రాప్తి కోసం
నవగ్రహ హోమం – గ్రహదోష నివారణ, నవగ్రహ అనుగ్రహం కోసం
మహామృత్యుంజయ హోమం – అపమృత్యు దోష నివారణార్థం
దుర్గ సూక్త హోమం – ఐశ్వర్య ప్రాప్తి కోసం
మహా సుదర్శన హోమం – దృష్టిదోష నివారణార్థం
మేద దక్షిణామూర్తి హోమం – మేధాశక్తి, జ్ఞాపకశక్తి పెంపు కోసం
స్వయంవర పార్వతి హోమం – శీఘ్ర వివాహ ప్రాప్తి కోసం
ధన్వంతరి హోమం – ఆయురారోగ్యాల కోసం
మహారుద్ర హోమం – అష్ట ఐశ్వర్యాల ప్రాప్తి కోసం
లఘు చండీ హోమం, మహా పూర్ణాహుతి – పాపక్షయం, శాంతి కోసం నిర్వహించనున్నారు.
పండితుల ప్రకారం పుష్కర కాలంలో ఈ హోమాల్లో పాల్గొనడం ద్వారా దైవానుగ్రహం లభించడంతో పాటు కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.

ఆధ్యాత్మికం ఉట్టిపడేలా..
పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. ఘాట్లు, టెంట్ సిటీలు, అన్నదాన శిబిరాలు, వైద్య కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య ఏర్పాట్లను అధికారులు విస్తృతంగా చేపట్టారు. పోలీసు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం మొత్తం విద్యుత్ దీపాలతో, రంగురంగుల అలంకరణలతో, పూలమాలలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ ప్రాంగణం నుంచి త్రివేణి సంగమం వరకు ప్రతి ప్రాంతాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరించారు. రాత్రివేళల్లో విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న కాళేశ్వర క్షేత్రం భక్తులకు కనువిందు చేస్తోంది. త్రివేణి సంగమ స్నానం, సరస్వతి అమ్మవారి ఆశీస్సులు, కాళేశ్వర ముక్తీశ్వర దర్శనం, మహా హోమాలు, సాయంత్ర హారతులతో సరస్వతి అంత్య పుష్కరాలు ఈసారి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి.

CLICK HERE TO READ states | సైబర్ నేరాలకు సిమ్‌లు సరఫరా చేస్తున్న 66 మంది అరెస్ట్

CLICK HERE TO READ MORE