మండల కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం రద్దు చేయాలి: తండ సత్తయ్య గౌడ్

మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని వెంటనే రద్దు చేసి, పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలతో ఏకాభిప్రాయంగా కొత్త నియామకం చేపట్టాలని ముషిపట్ల మాజీ సర్పంచ్ తండ సత్తయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రకటించిన నియామకం పార్టీ శ్రేణులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా, ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయంతో జరిగిందని ఆరోపించారు.

తాను రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసి, 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవలందిస్తున్న సీనియర్ నాయకుడినని పేర్కొన్న ఆయన, తనలాంటి నాయకులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టడం బాధాకరమన్నారు. స్థానిక ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నేతలతో చర్చించి అందరి ఏకాభిప్రాయం మేరకు మండల అధ్యక్షుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ ఐక్యత, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.