మహిళల భద్రత, భరోసాపై షీటీమ్ అవగాహన

మహిళల భద్రత, భరోసాపై షీటీమ్ అవగాహన

-ఇంచార్జి ఎస్సై ఉషారాణి

దండేపల్లి, ఆంధ్రప్రభ: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబార్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు దండేపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. మంగళవారం స్థానిక యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ నేర్చుకుంటున్న మహిళల కోసం మంచిర్యాల షీటీమ్ ఇంచార్జి ఎస్సై ఉషారాణి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై ఉషారాణి మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్ ప్రాముఖ్యతను, వారు నిర్వహించే విధులను క్షుణ్ణంగా వివరించారు. సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టాల నిబంధనలు, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్ నివారణ, టీ సేఫ్ అప్లికేషన్ వినియోగం, పని ప్రదేశాలలో జరిగే లైంగిక వేధింపుల ఎదుర్కొనే విధానాలను చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న తరుణంలో సోషల్ మీడియా వల్ల జరిగే లాభనష్టాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సైబర్ నేరాలకు గురైతే తక్షణ సహాయం కోసం సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930, అత్యవసర రక్షణ కోసం డయల్ 100 ప్రాముఖ్యతను వివరించారు.

ఎవరైనా డ్రగ్స్, మత్తు పదార్థాలు సేవించి మహిళలను వేధించినా, రోడ్లపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా అస్సలు భయపడకూడదని ఆమె ధైర్యం చెప్పారు. బాధితులు వెంటనే డయల్ 100 లేదా రామగుండం షీ టీమ్ ప్రత్యేక నెంబర్ 6303923700 కు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ కానిస్టేబుల్స్ జ్యోతి, వనిత, యూనియన్ బ్యాంక్ మేనేజర్, మగ్గం శిక్షణ పొందుతున్న మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply