విధి నిర్వహణలో ఉద్యోగిపై దాడి కలకలం
విధి నిర్వహణలో ఉద్యోగిపై దాడి కలకలం
నర్సంపేట, ఆంధ్రప్రభ: నర్సంపేట మున్సిపాలిటీ ఫిల్టర్ బెడ్లో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్న కనుకుల రాహుల్ విధి నిర్వహణలో ఉండగా గంజాయి బ్యాచ్‌తో కలిసి తనపై దాడి చేయించారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటన వెనుక కార్మిక నాయకుడి ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న మున్సిపల్ కార్మికుడు ఉన్నాడని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన జాతీయ మాల మహానాడు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమల్ల రవి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. విధుల్లో ఉన్న ఉద్యోగిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, వెంటనే ఉద్యోగం నుండి తొలగించి అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
