Regonda ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్’ నిర్వహణ
Regonda ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్’ నిర్వహణ
- గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన
రేగొండ (Regonda), ఆంధ్రప్రభ:
రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్’ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, మాతా-శిశు ఆరోగ్య విభాగం ప్రోగ్రామ్ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది గర్భిణీలకు, 10 మంది అధిక ప్రమాద గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహార పదార్థాలు, కోడిగుడ్లు, పాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, కాల్షియం అధికంగా ఉండే రాగిజావ వంటి ఆహారాలను తీసుకోవాలని తెలిపారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
అధిక ప్రమాద గర్భిణీలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జనని సురక్ష యోజన, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, జనని శిశు సురక్ష కార్యక్రమాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గర్భిణీలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
