కల్వర్టు పనుల్లో నిర్లక్ష్యం… వరుస ప్రమాదాలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండల పరిధిలోని బొమ్మనపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై నక్కమర్రి వాగు వద్ద చెదురు బావి తండా సమీపంలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే రెండు ప్రమాదాలు చోటుచేసుకోగా, ఆదివారం రాత్రి మరో ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండెమోని బచ్చలయ్య తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై అచ్చంపేట నుండి బొమ్మనపల్లి వైపు వెళ్తుండగా, రహదారి సరిగా ఉందని భావించి ముందుకు సాగారు. అయితే కల్వర్టు కోసం తవ్విన గుంతను గమనించకపోవడంతో వాహనం అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో అతని భార్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బిసిఎఫ్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ కాంట్రాక్టర్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం పట్ల మండిపడుతున్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చెయ్యని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కల్వర్టు నిర్మాణ ప్రదేశంలో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
