రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు

  • భూసార కార్డుల పంపిణీ
  • సహజ వ్యవసాయంపై దృష్టి

రాయపోల్, ఆంధ్రప్రభ: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా రాయపోల్ మండలంలోని నాలుగు రైతు వేదికల్ల సోమవారం సమావేశాలు నిర్వహించారు. రాయపోల్, చిన్నమాసనపల్లి (మంతూర్), ఆరేపల్లి, వడ్డేపల్లి రైతు వేదికల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఉమ్మడి దౌల్తాబాద్–రాయపోల్ ఏఎంసీ ఛైర్మన్ కనకయ్య రైతులకు భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం చేస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. మట్టి నమూనాల సేకరణ, మట్టి ఆరోగ్య పరిరక్షణ ప్రాముఖ్యతపై వివరించి వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.

సన్న వరి రకాల సాగు ద్వారా అదనపు బోనస్ పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పశువుల, కోళ్ల, గొర్రెల ఎరువులు, వానపాముల ఎరువులు వంటి సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. అలాగే వేప నూనె, గణజీవ అమృతం, పంచగవ్య, వెస్ట్ డికంపోజర్, బ్రహ్మాస్త్రం, అగ్నిహస్త్రం వంటి సహజ కషాయాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నరేష్, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఆత్మ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, సాయిల్ వాలంటీర్లు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.