పంట మార్పిడితోనే సుస్థిర ఆదాయం

పంట మార్పిడితోనే సుస్థిర ఆదాయం

  • శాస్త్రవేత్త డా. బి. మంజు భార్గవి

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారానే సుస్థిరమైన ఆదాయాన్ని పొందగలరని రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థాన శాస్త్రవేత్త డాక్టర్ బి. మంజు భార్గవి పేర్కొన్నారు. సోమవారం కమ్మర్‌పల్లి మండలంలోని చౌటుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమం మే 23 వరకు కొనసాగుతుందని తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఒకే రకమైన పంటను పదేపదే సాగు చేయడం వల్ల నేలలోని నిర్దిష్ట పోషకాలు హరించుకుపోతాయి. పంట మార్పిడి వల్ల నేల సారం మెరుగుపడి, పోషకాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఒకే పంటను వేయడం వల్ల ఆ పంటకు ఆశించే కీటకాలు, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పంటలు మార్చడం ద్వారా వీటి ఉధృతిని సహజంగానే తగ్గించవచ్చు. ఈ విధానం వల్ల రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి, పెట్టుబడి ఖర్చు ఆదా అవుతుంది. తద్వారా అధిక దిగుబడి రావడమే కాకుండా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
నేల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది. రైతులు తమ భూమి స్వభావం, సాగునీటి లభ్యత మరియు మార్కెట్ డిమాండ్‌ను బట్టి తగిన పంటలను ఎంచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ, సర్పంచ్ మహబూబ్, ఏఈవో ఎం. పద్మ మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.