కలెక్టర్ చొరవతో ఇద్దరు చిన్నారులకు విద్యాభాగ్యం
బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించిన రాజర్షి షా
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలో బడి బయట ఒక్క చిన్నారి కూడా ఉండకుండా ప్రతి బాలబాలికకు విద్య అందేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
మంగళవారం ఇంద్రవెల్లి మండల పర్యటన సందర్భంగా బడి బయట ఉన్న ఇద్దరు చిన్నారులను గుర్తించిన కలెక్టర్ వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను ఆదేశించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించారు.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని సాయినగర్‌లో నివసిస్తున్న కమరే మల్లేష్ పవార్ కుటుంబానికి చెందిన నలుగురు పిల్లల్లో ఇద్దరు మాత్రమే పాఠశాలకు వెళ్తుండగా, మరో ఇద్దరు చిన్నారులు తండ్రితో కలిసి వృత్తి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు.
ఈ విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి మిల్కాకు తెలియజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ అధికారులు కుటుంబాన్ని కలిసి తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతను వివరించారు.
అనంతరం చిన్నారులు సునీతను ఇంద్రవెల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతిలో, సునీల్‌ను ఎంపీపీఎస్ ఇంద్రవెల్లిలో 5వ తరగతిలో చేర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక్క బాల కార్మికుడు, ఒక్క బడి బయట పిల్లవాడు కూడా ఉండకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ప్రతి చిన్నారికి విద్యను అభ్యసించే హక్కు ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని సూచించారు.
ఎక్కడైనా బడి బయట పిల్లలు లేదా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
