శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం..

శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం..
చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి గ్రామదేవత, చల్లనితల్లి శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. తొలుత ఆలయంలో పూజారి చల్లపల్లి కోటేశ్వరరావు – కమల దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
డప్పువాయిద్యాల నడుమ అమ్మవారి ఘటం బిందెను చల్లపల్లి పూర్ణ శిరసున ఉంచుకుని ఆలయం నుంచీ బయటకు తీసుకురాగా, పుట్టింటి వారు, భక్తులు వెంటసాగగా భారీ ఊరేగింపుగా తొలుత పడమరవీధిలోని పుట్టింటివారైన పత్తిపాటి వారి ఇంటికి వెళ్లింది. పుట్టింటి వారు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేయగా, తిరిగి ఆలయానికి రాగా..అక్కడి నుంచీ గ్రామసంచారం ప్రారంభమైంది. అమ్మవారు ప్రతిఏటా గ్రామసంచారం చేయటం ద్వారా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకం.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు లంక కొండలు, గొర్రెపాటి పిచ్చేశ్వరరావు(మునుసబ్), విన్నకోట శంకర్, పత్తిపాటి రత్నం, పత్తిపాటి కుటుంబీకులు, తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
