Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో కొత్త భద్రతా నిబంధనలు..

Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో కొత్త భద్రతా నిబంధనలు..

నకిలీ ఉద్యోగులు, అక్రమ ప్రవేశాలకు చెక్..
ప్రతి వాహనం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

Telangana Secretariat ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయం ఆవరణలోకి ప్రవేశించే ప్రతి వాహనానికి క్యూఆర్ (QR) కోడ్ తప్పనిసరి చేసింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే వాహనాలకు ప్రవేశం కల్పించాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అమలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే వాహనం నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. దీంతో సచివాలయంలోకి ప్రవేశించే ప్రతి వాహనంపై పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. స్కాన్ చేయని వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నకిలీ ఉద్యోగుల పేరుతో సచివాలయంలోకి ప్రవేశించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను అరికట్టడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. సచివాలయానికి వచ్చే వాహనాల రాకపోకలను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు సచివాలయంలోకి ప్రవేశించిన వాహనాల సంఖ్య, వాటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతుండటంతో భద్రతా పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా మారనుంది. ఈ కొత్త విధానంతో సచివాలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్రమ ప్రవేశాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.