బీహార్‌లో పరీక్షల వ్యవస్థ కుప్పకూలింది: తేజస్వి యాదవ్

పేపర్ లీక్‌లపై ఆగ్రహం..
విద్యార్థులపై కాల్పుల ఆరోపణలు..
ఆగస్టు 19న రాజ్‌భవన్‌ ముట్టడికి ఆర్జేడీ పిలుపు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : బీహార్‌లో పరీక్షల వ్యవస్థ, శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆర్జేడీ నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలతో పాటు నియామక పరీక్షల్లోనూ పేపర్ లీక్ అవుతోందని విమర్శించారు. మెరిట్ ఆధారంగా నిష్పక్షపాత ఎంపిక జరిగే పరిస్థితి లేదని అన్నారు. బీహార్ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేజస్వి ఆరోపించారు. ఇటీవల సివాన్‌లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనను ప్రస్తావిస్తూ.. తమ హక్కుల కోసం నిరసన చేస్తున్న విద్యార్థులపై కాల్పులు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.

సివాన్ ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని తేజస్వి విమర్శించారు. ఒక కానిస్టేబుల్‌ను మాత్రమే తొలగించారని, ఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులను ప్రభుత్వం కాపాడుతోందని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 19న రాజ్‌భవన్‌కు భారీ నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు తేజస్వి యాదవ్ ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన వారి వివరాలు, వారిపై మోపిన అభియోగాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.