బాలాపూర్‌లో 21 ఏళ్ల యువతి రెహానా హత్య..
కత్తితో దాడి చేసిన ప్రియుడు మహ్మద్ సలామ్
హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో తరలించే యత్నం..
అనుమానితుల పాత్రపై పోలీసుల ఆరా
బిహార్‌కు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం..
మరో యువకుడితో సన్నిహితంగా ఉందన్న అనుమానం హత్యకు కారణమా?
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగుచూసింది. బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల యువతి రెహానా కత్తిపోట్లకు గురై మృతి చెందింది. ఆమెను ప్రియుడు మహ్మద్ సలామ్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని రెహానా ఒత్తిడి చేయడం, మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఫంక్షన్ హాల్‌లో పరిచయం.. ప్రేమగా మారిన బంధం
బిహార్‌కు చెందిన రెహానా బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటూ ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న మహ్మద్ సలామ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, కొంతకాలానికి ప్రేమగా మారినట్లు సమాచారం. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని రెహానా సలామ్‌పై ఒత్తిడి చేసినట్లు, ఇదే సమయంలో ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానం సలామ్‌కు కలిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
గొడవలో కత్తితో దాడి
ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాటామాటా పెరగడంతో సలామ్ కత్తితో రెహానాపై దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే హత్యకు ఖచ్చితమైన కారణం, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
గోనె సంచిలో మృతదేహం.. పోలీసులకు సమాచారం
హత్య అనంతరం రెహానా మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు సలామ్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాలాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మరో ఇద్దరి పాత్రపై ఆరా
ఈ కేసులో సలామ్‌తో పాటు మరో ఇద్దరి పాత్ర ఉందా? మృతదేహాన్ని తరలించేందుకు వారు సహకరించారా? హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందా? లేక ఇద్దరి మధ్య జరిగిన గొడవలో క్షణికావేశంతో దాడి జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలను, నిందితుల పాత్రను నిర్ధారించే ఆధారాలను సేకరిస్తున్నారు.
