Telangana–Living-Cities ఫ్యూచర్ సిటీ ఇక పరుగే పరుగు..! .Andhra Prabha Exclusive Story
Telangana–Living-Cities ఫ్యూచర్ సిటీ ఇక పరుగే పరుగు..! .Andhra Prabha Exclusive Story
- సీఎం రేవంత్ కొత్త ప్లాన్
- జనం కోసం.. జనం కాలనీలు.
- సీఎం మదిలో లివింగ్ సిటీ
- నివాసయోగ్య కాలనీల నిర్మాణం
- మౌలిక సదుపాయాలు
- మనవ వనరులపైనే ఫోకస్
- బహుళజాతి కంపెనీలకు ఆపరేషన్ ఆకర్ష్
- ఈ నెలాఖరులో ప్రత్యేక కాలనీలు ప్రకటన చాన్స్
- కెడ్రాయ్ ఆధారంగా,, రూట్ మ్యాప్ సిద్ధం
- అసెంబ్లీ వేదికగా ఈ కొత్త ప్రణాళిక వెల్లడి
( హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో) :

Telangana–Living-Cities ” తన కలల సౌధం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లక్ష్యాలను ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు, తద్వారా రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమై బలమైన పునాదులు వేసేందుకు చర్యలు మొదలు పెట్టారు. తన పాలనలో చెరగని చిహ్నంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి శాశ్వత ముద్ర వేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు రాబట్టి, ప్రతిపాదిత ప్రాంతంలో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు మొదలు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చెందేలా చేయాలన్న దృఢసంకల్పంతో ఉన్నారు. కేవలం పెట్టుబడిదారులే కాదు.. దేశ, విదేశాల్లోని ప్రముఖుల దృష్టిని ఆకర్షించేలా ‘లివింగ్ సిటీ-‘ల కార్యాచరణకు సీఎం రేవంత్ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రకారం.. ఆయా సంస్థలు ‘భారత్ ఫ్యూచర్ సిటీ-‘కి సాధ్యమైనంత త్వరలోనే వచ్చేలా చేయాలన్న కొత్త వ్యూహం కూడా ఈ కార్యాచరణ వెనక దాగి ఉన్నట్లు తెలుస్తోంది. నివాసయోగ్య కాలనీల నిర్మాణంతో మౌలిక వసతులు, మానవ వనరులు అందుబాటు-లోకి తీసుకువచ్చి అక్కడ జరుగుతున్న అభివృద్ధి అందరికీ కనిపించేలా, భౌగోళికంగా ఫ్యూచర్ సిటీ వరకు రవాణా, ప్రయాణ రాకపోకలు ప్రారంభమయ్యేలా చేయాలని సంకల్పించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు విస్తరిస్తున్న అనేక బహుళజాతి కంపెనీల అధిపతులకు, ప్రతినిధులకు నచ్చేలా, మెచ్చేలా నాలుగో నగరం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. సీఎం కార్యాలయ వర్గాల అంతర్గత కార్యాచరణ ప్రకారం.. ఈ నెలాఖరులోగా ప్రతిపాదిత ప్రాంతంలో వివిధ వర్గాలకు ప్రత్యేక కాలనీలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటికే సంబంధిత అధికార యంత్రాంగం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లిd సమావేశాల వేదికగా ఈ కొత్త కార్యాచరణ, దాని లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

తన మదిలో ఉన్న రాజధాని నగర విస్తరణ కార్యరూపం దాల్చడంతో సీఎం రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. రానున్న అసెంబ్లిd బడ్జెట్ సమావేశాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో లివింగ్ సిటీల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సమస్యలెన్ని వెంటాడుతున్నా.. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణలో రేవంత్ సర్కారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుదలతో అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన నాలుగో నగరం అభివృద్ధి దిశగా శరవేగంగా పావులు కదుపుతోంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై తాను ఇప్పటికే పూర్తిచేసిన వివేశీ పర్యటనలు, అధ్యయనాలు, అనుభవాలను నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజాగా అధికార యంత్రాంగానికి మార్గనిర్ధేశం చేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. దేశంలో రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి వైపు దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం ఘనతను ప్రపంచస్థాయిలో చాటాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్న ప్రాంతం చుట్టూ ముచ్చెర్ల, బేగరికంచె తదితర గ్రామాలను కలుపుతూ తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ-‘ అభివృద్ధి కార్యాచరణలో లివింగ్ సిటీలు కూడా ఏర్పాటు చేయాలన్న మరో కొత్త ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తయింది. ఆ దిశగా ప్రతిపాధనలు రూపొందించాలని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) అధికారులకు మార్గనిర్ధేశం చేశారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం తన ఆలోచనలను, విదేశీ పర్యటనల అధ్యయన సారాంశాన్ని వారికి వివరించారు. ఆ మేరకు ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ.. ఇలా విభిన్న రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ రంగాల్లో పెట్టుబడుకు సంబంధించి ఇప్పటికే కుదిరిన ఒప్పందాలన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చేసేందుకు మౌళిక వసతుల కల్పన అత్యంత ప్రధానం కావడంలో ఆ దిశగా దృష్టి పెట్టారు.

ఇందుకు సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రతినిధులతో తాజాగా రేవంత్‌రెడ్డి మరోసారి సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. స్థిరాస్తి వ్యాపార రంగంలో మూడు దశాబ్ధాల అనుభవం కలిగిన ఆ సంస్థ ప్రతినిధుల ఆలోచన మేరకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ‘లివింగ్ సిటీ’లు అవసరమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మా సిటీ కంపెనీలకు మానవ వనరులకు సమకూర్చడం, అందుకు వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. నివాస గృహ సముదాయాల నిర్మాణానికి భూములు కేటాయించి ఇప్పటి నుంచే లేఅవుట్లు సిద్ధం చేసే పనులు ప్రారంభించాలని, అలాగైతే.. పెట్టుబడులకు ముందుకు వచ్చే బహుళజాతి కంపెనీలను మరింతగా ఆకర్షించవచ్చునని సర్కారు భావిస్తోంది. వంద ఎకరాలకు ఒకటి చొప్పున లివింగ్ సిటీలను ఏర్పాటుకు దిశగా యోచిస్తోంది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో మాదాపూర్‌లో నిర్మించిన హై-టె-క్ సిటీ- తరహాలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్రెడాయ్ ప్రతిపాదనకు సీఎం సూచనప్రాయ అంగీకారం తెలిపి అధికార యంత్రంగానికి మార్గదర్శకాలు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఫోర్త్ సిటీని ఎంపిక చేసిన ప్రాంతంలో అందుబాటు-లో 10 నుంచి 14 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఓ వైపు భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే.. మొదటగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఫ్యూచర్ సిటీ- జోన్లు.. వివిధ రంగాలకు కేటాయించే భూములపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. మరి ఈ నెట్ జీరో సిటీ-కి హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే.. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ముఖ్యమేనని అధికారులు నివేదించారు. హైదరాబాద్ శివార్లలో శ్రీశైలం హైవేపై ఏర్పాటు- అవబోతున్న ఈ సిటీ-కి నిమిషాల్లో చేరుకోవాలంటే విస్తృతమైన ట్రాన్స్పోర్ట్ నెట్ వర్క్ కూడా అవసరమే. అత్యంత ప్రాధాన్యత గల ఈ అంశంపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించి సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి.. అలాగే త్వరలో నిర్మితమయ్యే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నుంచి ఎలా చేరుకోవడం, అలైన్మెంట్లపైనా భారీగానే కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ నగరం వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు కనెక్టివిటీ- కల్పించడంపై వివిధ శాఖలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇందుకు సంబంధించి తన ఆలోచనల మేరకు ఉన్నతాధికారుల కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ-కి 16 రేడియల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే రూట్ మ్యాప్ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో న్యూయార్క్ నుంచి లండన్ దాకా విస్తృతంగా పర్యటించి వచ్చారు. ఫ్యూచర్ సిటీ- భవిష్యత్తులో ఇండియాకు సమాధానం అవుతుందని, ఇది ఇండియా మొదటి నెట్ జీరో కార్బన్ సిటీ- అవుతుందని ఆయన అనేకసార్లు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ-లో ఆర్టిఫీషియల్ (ఏఐ), మెడికల్ టూరిజం, స్పోర్ట్స్, సాప్ట్nవేర్ అలాగే ఫార్మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారుతుందని ఆయన అధికాలరులతో సమీక్షల సందర్భాంగా చెబుతూ వస్తున్నారు. ఫ్యూచర్ సిటీ-కి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను తాజాగా సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీ-కి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించగా.. అధికారులు కొన్ని ప్రతిపాదనల అమలుకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా మరో ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే మెట్రో రైలు ప్రతిపాదిత రెండో దశ పూర్తయితే 78 కిలోమీటర్లతో ఐదు కారిడార్లు రానున్నాయి. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు హైదరాబాద్ సిటీ-లోని మెట్రో లైన్లతో లింకప్ కానున్నాయి. అటు- ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీ-కి మెట్రో రైలు రూట్ ఆప్షన్లను అధికారులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఒకటి, తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరొకటి ఆప్షన్లు రూపొందించారు. ఆప్షన్ 1లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ- దాకా దూరం 32 కిలోమీటర్లు ఉంటే… స్టేషన్ల సంఖ్య 12 ఉంటాయని, నిర్మాణానికి 6173 కోట్లు- అవసరమవుతాయని అంచనాలు అందజేశారు. ఆప్షన్ 2లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ వర్శిటీ- వయా రావిర్యాల మీదుగా అయితే 32 కిలోమీటర్లు ఉండగా, 10 స్టేషన్లు, నిర్మాణ వ్యయం 5216 కోట్లు- అవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు లెక్కలేశారు. ఆప్షన్ 3లో భాగంగా ఎయిర్ పోర్ట్ నుంచి వయా శ్రీశైలం రోడ్డు ద్వారా 32 కిలోమీటర్లు ఉండగా, 12 స్టేషన్లు, 3256 కోట్లు- అవసరమవుతాయని ముఖ్యమంత్రికి నివేదించారు. 2028 నుంచి 2053 వరకు ప్రయాణికుల సంఖ్య కూడా ఎంత ఉంటు-ందో అంచనాలు వేసి ఆ ప్రకారం పకడ్బందీగా ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు.
