Farmer Knowledge Centers | కొత్త ఆవిష్కరణలకు అవకాశం

Farmer Knowledge Centers | కొత్త ఆవిష్కరణలకు అవకాశం
Farmer Knowledge Centers | శాస్త్రీయ సాగుకు ఆధునిక సాంకేతిక శిక్షణ
డ్రోన్లు, ఏఐ, రోబోటిక్స్‌తో వ్యవసాయ అభివృద్ధి
రైతులకు భూసార పరీక్షలు, ప్రత్యేక మార్గదర్శకత్వం
యువతకు భారీ ఉపాధి అవకాశాలు
Farmer Knowledge Centers | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వ్యవసాయంలో సాంకేతికతను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పంటల మార్పిడి విధానాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక రైతు విజ్ఞాన కేంద్రాన్ని (ఆర్డీవీకే) ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 17 ఏరువాక కేంద్రాలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చనుండగా, మరో 15 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో మొత్తం 32 జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, మెదక్, సిద్దిపేట, నారాయణపేట, నిర్మల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి కేంద్రానికి సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించనుండగా, అక్కడ ప్రయోగశాలలు, శిక్షణ కేంద్రాలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలు, గోదాములు నిర్మించనున్నారు. రైతులకు క్షేత్రస్థాయిలోనే శాస్త్రీయ సలహాలు అందించేందుకు శాస్త్రవేత్తలు నిత్యం అందుబాటులో ఉంటారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా పంటల సాగుపై సూచనలు ఇవ్వనున్నారు. అలాగే వాతావరణ మార్పులు, పంటల మార్పిడి అవసరం, తెగుళ్ల నివారణ, సేంద్రియ ఎరువుల వినియోగం, నాణ్యమైన విత్తనాల ఎంపిక వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వ్యవసాయంలో డ్రోన్లు, కృత్రిమ మేథ
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ, నీటి పొదుపు పద్ధతులు వంటి అంశాల్లో కూడా రైతులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
అంతేకాకుండా స్టార్టప్ సంస్థలకు కూడా ఈ కేంద్రాల్లో స్థలాలు కేటాయించి వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు కొత్త వంగడాలను మినీ కిట్ల రూపంలో అందించి, వాటి ఫలితాల ఆధారంగా ఇతర రైతులకు విస్తరించే విధానం అమలు చేయనున్నారు.
సాధారణ పంటలతో పాటు నూనె గింజలు, చిరుధాన్యాలు, అపరాలు, ఉద్యాన పంటల సాగుపై కూడా రైతులకు ప్రత్యేక మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. రైతుల ఆదాయం పెరిగేలా పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించడం ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది.
రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 10 మంది సిబ్బంది అవసరం ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ముగ్గురు శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో), సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రొజెక్టర్ ఆపరేటర్, ఫొటోగ్రాఫర్, అటెండర్ పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే కేంద్రాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
