TG | హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువ‌ !

హైడ్రా ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు అందాయి. కాగా, ఈ ఫిర్యాదులపై అక్క‌డిక‌క్క‌డే అధికారులతో చర్చించి.. చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. మొత్తం ఫిర్యాదుల్లో అధిక‌భాగం పార్కులు, ర‌హ‌దారుల క‌బ్జాలే ఉన్నాయ‌ని.. లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారులుండేలా చూడాల‌ని సూచించారు.

కాలనీల చుట్టూ ఉన్న ప్రహరీలను నిర్మించిన ప‌క్షంలో.. వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు సెప్టిక్ ట్యాంకుల కోసం రిజర్వ్ చేసిన స్థలాలు… ఇప్పుడు వాడుకలో లేవని.. వాటిని ప్ర‌జావ‌స‌రాల‌కు కేటాయించిన స్థ‌లంగానే ప‌రిగ‌ణించాల‌ని సూచించారు. ఎవ‌రైనా క‌బ్జాలుచేస్తే వెంట‌నే వాటిని తొల‌గించాల‌ని క‌మిష‌న‌ర్ అధికారుల‌కు సూచించారు.

ఇక‌ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు కూడా చూపించి సమస్యల‌ పరిష్కారానికి చర్యలు సూచించారు. ఫిర్యాదుదారులు సంప్ర‌దించాల్సిన హైడ్రా అధికారుల‌ను ప‌రిచ‌యం చేసి.. వారు విచార‌ణ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో అన్ని వివ‌రాలు అంద‌జేయాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *