TSRTC Smart Cards | మహిళల కోసం ఆర్టీసీ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ

TSRTC Smart Cards | మహిళల కోసం ఆర్టీసీ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ

TSRTC Smart Cards | జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు దిశగా చర్యలు
ఏటీఎం తరహాలో స్మార్ట్ కార్డు ప్రత్యేకతలు
ఉచిత ప్రయాణ పథకంలో భారీ ఆదా
నకిలీ ఆధార్ కార్డుల దుర్వినియోగానికి చెక్
కార్డుల జారీకి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

TSRTC Smart Cards | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి వనితలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. వీటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇకపై వాటిని చూపిస్తే చాలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం సాగించవచ్చు. ఈ కార్డును రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచే అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ విషయమై సమీక్షించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనలను ఆర్థికశాఖ మంత్రికి ఎండీ నాగిరెడ్డి వివరించడంతో పాటు స్మార్ట్ కార్డుల జారీకి సంబంధించిన వ్యయం గురించి తెలిపారు. ఇందుకు ఆమోదం తెలపడంతో తొలుత జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.

ఏటీఎం తరహాలో కార్డు

ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు పంపిణీ చేసే స్మార్ట్ కార్డు ఏటీఎం తరహాలో ఉండనుంది. ఆధార్ కార్డు, ఒక ఫొటో సేకరించి మహిళల ప్రాథమిక సమాచారం చిప్‌తో అనుసంధానిస్తారు. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగించుకోగా, ఈ పథకం ద్వారా మహిళలు రూ.10 వేల కోట్ల రూపాయలు ఆదా చేశారు.

దుర్వినియోగానికి చెక్

ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీని వల్ల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది.

కార్డుల జారీ దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, సమీప కార్డుల జారీ కేంద్రాన్ని కనుగొనడానికి టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని త్వరలో పొందుపరుస్తారు. కార్డులు అందే వరకు ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

Leave a Reply