సింగరేణిలో అధికారుల ఆందోళనలు ఉధృతం..
పే అప్‌గ్రేడ్, పీఆర్‌పీపై యాజమాన్యానికి హెచ్చరిక
ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు.. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదంటున్న సీఎంఓఏఐ
గోదావరిఖని, ఆంధ్రప్రభ: కోల్ ఇండియా తరహాలో పే అప్‌గ్రేడ్ అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అఖిల భారత అధికారుల సంఘం (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. సింగరేణి కోల్‌బెల్ట్ పరిధిలోని అన్ని జీఎం కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
పే అప్‌గ్రేడ్‌ను వెంటనే అమలు చేయడంతో పాటు అధికారులకు రావాల్సిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఆర్‌పీ)ని తక్షణమే చెల్లించాలని అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మహిళా అధికారులు పాల్గొన్నారు. రామగుండం ఏరియా ఎస్‌వోటు జీఎం చంద్రశేఖర్, అధికారి హనుమంతరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ దీక్షలో మహిళా అధికారులు ముగురం బాంధవి, కారం పద్మ, డాక్టర్ డి. స్రవంతి, ఎస్. సౌమ్య, రజిని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పే అప్‌గ్రేడ్ అమలులో జాప్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా చెల్లించాల్సిన పీఆర్‌పీని ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు, పదోన్నతుల విషయంలో పారదర్శకత పాటించాలని, బొగ్గు పరిశ్రమ మనుగడ కోసం కొత్త బొగ్గు బ్లాకులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అధికారులకు నష్టం కలిగే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్న సంఘం ప్రతినిధులు, యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. దశలవారీగా నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని, వైఖరిలో మార్పు లేకుంటే హక్కుల సాధన కోసం చివరకు సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
