Telangana | కులగణన సర్వేకు కేబినేట్ ఓకే
ఎస్సీ వర్గీకరణ నివేదికకు ఆమోదముద్ర
రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటి
బిసి రిజర్వేషన్ పెంపుపై సుదీర్గ చర్చ
అసెంబ్లీ సమావేశంలో బిసి రిజర్వేషన్ పెంపు బిల్లు
రిజర్వేషన్ పెంపు బిల్లును కేంద్రానికి
హైదరాబాద్ – ఆంధ్రప్రభ – కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదిక కు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ఈ రెండింటిపైనా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. ప్రధానంగా రెండు కీలక అంశాలపై చర్చ జరిగింది. అందులో ఒకటి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో చర్చకు వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్‌ను స్థానిక సంస్థల్లో 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో స్థానిక సంస్థల్లో బీసీ డిక్లరేషన్ పెంచేందుకు సమగ్రంగా కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయంచి.. ఆ మేరకు 50 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించింది.

సమగ్ర కులగణనలో బీసీ జనాభాను 46శాతంగా చేర్చింది. ముస్లింలలో ఉన్న బీసీలతో కలిపితే 56 శాతంగా తేల్చారు. సమగ్ర కులగణనపై సబ్‌కమిటీ నివేదిక కేబినెట్‌కు చేరగా.. దీనిపై చర్చించారు.అనంతరం ఎస్సీ వర్గీకరణ నివేదిక, సమగ్ర కులగణనకు సంబంధించిన సర్వే నివేదికను కేబినెట్ ఆమోదించింది. దీన్ని అమలు చేయాలంటే కేంద్రం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.. ఈ నివేదికను ఆమోదించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత కేంద్రానికి పంపాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
దాంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంశంపై రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏ, బీ, సీ మూడు వర్గాలుగా విభజించి.. ఏ గ్రూప్‌కు ఒక శాతం సంచార జాతులను చేర్చగా, బీ గ్రూప్‌లో మాదిగ, మాదిగ ఉపకులాలు – 9శాతం, సీ గ్రూప్‌లో మాల మాల ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికపై సమగ్రంగా చర్చించి కేబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకుని ఆమోద ముద్ర వేశారు.
ఇక నేడు జరగనున్న శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఈ రెండు నివేదికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. దీనిపై లఘు చర్చ పెట్టి విపక్షాల అభిప్రాయాలను తీసుకోనున్నారు. కౌన్సిల్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేయబోతున్నారు.