బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు

బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఇంధన కొరత సెగ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ లభ్యత తగ్గిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడంతో గందరగోళం నెలకొంది.

హైదరాబాద్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మూడు రోజులుగా పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న కొద్ది బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో సీఏన్జీ కొరత కూడా కొనసాగుతోంది. సీఏన్జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి. పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ వేచి ఉండలేక చాలామంది తమ వాహనాలను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయి కిటకిటలాడుతున్నాయి.

తెలంగాణలోని జిల్లాల కేంద్రాలు, మండల ప్రాంతాల్లో అనేక బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత సామాన్య జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది.

గత ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ సమస్య సోమవారం నాటికి తీవ్రరూపం దాల్చి, మంగళవారం కూడా కొనసాగింది. హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇంధనం ఉన్న కొద్దిపాటి బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఉన్న చమురు కొరత వెనుక కేవలం స్థానిక కారణాలే కాకుండా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ముడి చమురు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీని ప్రభావం భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడటంతో, రాష్ట్రాలకు పంపే కోటాలో కోత విధించారని చెబుతున్నారు.

ఇంధనం అందుబాటులో ఉన్న కొద్ది బంకుల యజమానులు స్వయంగా పరిమితులు విధిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.500, కార్లకు రూ.2000 మాత్రమే ఇంధనం ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల టోకెన్ పద్ధతి అమలు చేస్తున్నారు.

వరి కోతల సీజన్ కావడంతో రైతులు డీజిల్ కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు, కోత యంత్రాలకు డీజిల్ అందకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంధన కొరతను అదునుగా భావించి కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పగలు ‘నో స్టాక్’ అని చెప్పి, రాత్రిళ్లు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు డీజిల్ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన కొరత ప్రభావం రవాణా రంగానికే కాకుండా చిత్ర పరిశ్రమపై కూడా పడింది. హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతున్న పలు సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. జనరేటర్లకు అవసరమైన డీజిల్ దొరక్కపోవడంతో చిత్రీకరణలు ఆగిపోయాయి.

చర్యలు శూన్యం

రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొరత ఉండటంతో సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ బంకులపై ఆధారపడటం, అలాగే ధరలు పెరుగుతాయనే వదంతులు ప్రజల్లో భయం కలిగిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో 193 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో ఎక్కువ శాతం బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ దొరకడం కష్టమైందని, కొన్ని చోట్ల మాత్రమే పరిమితంగా పెట్రోల్ లభిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారంతో వాహనదారులు పెద్ద ఎత్తున బంకుల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. పెద్ద డబ్బాల్లో ఇంధనం తీసుకెళ్తున్నారు.

మహబూబాబాద్ జిల్లాలో కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ వాహనదారులు రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అర్ధరాత్రి దాటినా బంకుల వద్ద క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా, సరకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంధనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పేవారు లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు.

Leave a Reply