కొత్త కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు

కొత్త కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: డిగ్రీ అంటే కేవలం మూడేళ్ల చదువు, ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదని, అది విద్యార్థి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. రాష్ట్రంలో డిగ్రీ విద్యను కేవలం సర్టిఫికెట్లకే పరిమితం చేయకుండా, విద్యార్థులకు ఉపాధి కల్పించే దిశగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిఫెన్స్ సైన్స్, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ వంటి నూతన కోర్సులను ప్రవేశపెడుతూ, వాటి నిర్వహణపై కళాశాలల యాజమాన్యాలకు ఉన్న సందేహాలను ఇప్పటికే నివృత్తి చేసినట్లు చెప్పారు. కొత్త కోర్సులకు సిలబస్ మెటీరియల్‌ను మేమే అందిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డితో ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూ…

డిగ్రీలో కొత్త కోర్సులు ఎందుకు?
ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సులు చదవడం వల్ల విద్యార్థులకు బయటి మార్కెట్లో ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. అందుకే ఏ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో, ఆ రంగాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించాం. ఈ కొత్త కోర్సులతో డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

కొత్త కోర్సులపై కళాశాలల్లో సందేహాలున్నాయా?
అవును, ఈ కోర్సులు గతంలో డిగ్రీ స్థాయిలో లేవు కాబట్టి కొన్ని అనుమానాలు ఉండటం సహజం. అందుకే మేము టీ-శాట్ ద్వారా, ప్రైవేట్ కళాశాలలతో సమావేశాలు నిర్వహించాం. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారు కోర్సులో చేరిన తర్వాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జూలై నాటికి ఈ కోర్సులపై పూర్తి స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

ఈ కోర్సుల విషయంలో ఉన్నత విద్యా మండలి బాధ్యత ఏమిటి?
ఉన్నత విద్యా మండలిగా మేము సిలబస్ సిద్ధం చేయడం, సంబంధిత పేపర్లను గుర్తించడం మాత్రమే కాకుండా, రీడింగ్ మెటీరియల్‌ను కూడా మేమే అందిస్తున్నాం. ఇలా రీడింగ్ మెటీరియల్ అందించడం ఇదే మొదటిసారి. ఏ కోర్సు చదివితే ఏ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయో ఆయా కంపెనీల జాబితాను (ఉదాహరణకు డిఫెన్స్ రంగానికి 50 కంపెనీలు) సిద్ధం చేసి కళాశాలలకు అందిస్తున్నాం.

కొత్త కోర్సులు విజయవంతంగా నడపాలంటే ఏమి చేయాలి?
కళాశాలలు తప్పనిసరిగా పరిశ్రమలతో ఎంఓయూ చేసుకోవాలి. దీనివల్ల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్‌లు కల్పించడం సులభమవుతుంది.

కొత్త కోర్సులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు దొరుకుతున్నారా?
మంచి ప్రశ్న. దీనికోసం మేము ప్రతి కోర్సుకు 20 నుంచి 30 మంది రీసోర్స్ పర్సన్ల జాబితాను కళాశాలలకు అందిస్తాం. కాలేజీలు వారిని విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించుకోవచ్చు. అదనంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్యూటర్స్ అనే టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నాం. మెటీరియల్‌ను ఏఐకు అందిస్తే, అది విద్యార్థులతో సంభాషిస్తూ పాఠాలను బోధిస్తుంది.

కోర్సు ప్రారంభించాలంటే కనీసం ఎంతమంది విద్యార్థులు ఉండాలి?
కనీసం 25 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటేనే ఆ కోర్సును సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. అందరూ కేవలం ఏఐ, ఎంఎల్ వైపు వెళ్లకుండా, కొత్తగా వస్తున్న ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, డిఫెన్స్, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ వంటి కోర్సులను కూడా ఎంచుకోవాలని సూచిస్తున్నాం. వీటిలో ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి.

ఇంజనీరింగ్‌తో పోలిస్తే మూడేళ్ల డిగ్రీలో అంత సిలబస్ ఎలా పూర్తి చేస్తారు?
మేము యూజీసీ సూచించిన ‘లైట్ బట్ టైట్’ విధానాన్ని అనుసరిస్తున్నాం. తరగతి గదిలో బోధనను తగ్గించి, విద్యార్థులను ఫీల్డ్ స్టడీ, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్‌ల వైపు మళ్లిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు నేరుగా పని చేస్తూ నేర్చుకుంటారు.

ఈ కొత్త కోర్సుల వల్ల డిగ్రీ పేర్లు మారుతాయా?
నామకరణం మారదు. బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీకామ్ అనే పేర్లే ఉంటాయి, కానీ వాటి స్పెషలైజేషన్ టైటిల్స్ మారుతాయి. ఉదాహరణకు బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌గా ఉంటుంది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సంపాదించేలా ఈ కోర్సులను రూపొందించాం. కళాశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సందేహాలను నివృత్తి చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Leave a Reply