రెండు గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

దట్టమైన పొగలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన..
మేడ్చ‌ల్ జిల్లా దేవరాయాంజాల్‌లో ఘ‌ట‌న‌

మేడ్చల్‌ జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : దేవరాయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోల్డ్‌ రష్‌ లాజిస్టిక్స్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గోదాంలో మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసే చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు రెండు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. దట్టమైన పొగలు అలుముకోవడంతో గోదాం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టం వివరాలు కూడా అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.