Machilipatnam | జూనియర్ డాక్టర్ల శాంతియుత నిరసన..

స్టైఫండ్ పెంచాలని డిమాండ్ .. అత్యవసర సేవలు కొనసాగింపు


Machilipatnam | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం శాంతియుత నిరసన చేపట్టారు. ఆసుపత్రి ఆవరణలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు.

జూనియర్ డాక్టర్లకు అందుతున్న స్టైఫండ్‌ను తక్షణమే పెంచాలని వారు డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్టైఫండ్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమ నిరసన కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను కొనసాగిస్తున్నామని జూనియర్ డాక్టర్లు తెలిపారు. అత్యవసర సేవలతో పాటు అన్ని వైద్య సేవలను యథావిధిగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి స్టైఫండ్ పెంపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల మచిలీపట్నం అధ్యక్షుడు డాక్టర్ కే. శివబ్రహ్మం, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్. అనిల్ కుమార్, డాక్టర్ ఎం. కోమల్ ఫణిర్మయి, కార్యదర్శి డాక్టర్ దివాకర్ రెడ్డి, ఉప కార్యదర్శి టి. రామకృష్ణ, ఎ. సంతోషిని తదితర జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.