సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
- మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మొబైల్ ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు ఈ ఫోన్లను సమర్థంగా వినియోగించుకొని విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
అనంతరం మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
