T20WorldCup | మనల్నెవడ్రా ఆపేది.. భారత్ బాదుడే బాదుడు

T20WorldCup | మనల్నెవడ్రా ఆపేది.. భారత్ బాదుడే బాదుడు

T20WorldCup | నేటి నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం
యూఎస్ఏతో టీమిండియా తొలి సమరం
బ్యాటింగ్‌లో దూకుడు కాంబినేషన్
బుమ్రా దూరం.. జట్టుకు ఫిట్‌నెస్ టెన్షన్
బౌలింగ్‌లో భారత్ బలమే బలం
భారత్ అంచనా ప్లేయింగ్ ఎలెవన్

T20WorldCup |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌ డెస్క్‌ : వీర‌బాదుడుకు వేళ‌య్యింది. విధ్వంసాల‌కు వేదిక‌లు సిద్ధ‌మ‌య్యాయి. బ్యాటు ప‌ట్టుకొని ఫోర్లు, సిక్సులు కొట్ట‌డానికి వీరులు రెడీ అయ్యారు. మైదానంలో దిగ‌డ‌మే త‌రువాయి అన్న‌ట్లు ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. త‌మ విన్యాసాల‌తో క్రికెట్ అభిమానులు అల‌రించేందుకు ఈ రోజు నుంచి క‌ద‌న రంగంలోకి దిగ‌నున్నారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పొట్టి క‌ప్‌ను ప‌ట్టేందుకు 20 జ‌ట్లు స్టేడియంలోకి అడుగుపెట్ట‌నున్నాయి. ఎవ‌రు ఎన్ని ఫోర్లు కొడ‌తారో.. ఎన్నెన్ని సిక్సులు బాదుతారో.. ఏ బ్యాట‌ర్ సెంచ‌రీల మోత మోగిస్తారో.. వికెట్ల వీరులు ఎవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌ల్లో మొద‌లయ్యే టీ20 ప్ర‌పంచ క‌ప్ చూడాల్సిందే.. ఈ వ‌ర‌ల్డ్ వార్ విజేత కావాల‌నే ఆకాంక్ష‌తో ప్ర‌తీ జ‌ట్టు త‌మ యుద్ధాన్ని మొద‌లు పెట్ట‌నుంది.

T20WorldCup
T20WorldCup

ఎన్నో రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పండ‌గ రానే వ‌చ్చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ నేటి నుంచే ఆరంభం కానుంది. మొదటి రోజు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రోజు టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని అమెరికా (యూఎస్ఏ) జట్టుతో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది.

T20WorldCup | భార‌త్‌కు ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు


అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అత‌డి స్థానంలో.. హ‌ర్షిత్ రాణా స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన మ‌రో సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ను తుది జ‌ట్టులో ఆడించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బుమ్రా శుక్ర‌వారం నిర్వ‌హించిన భార‌త ట్రైనింగ్ సెష‌న్‌కు హాజ‌రు కాలేదు.

దూకుడే మంత్రంగా…
యూఎస్ఏతో మ్యాచ్‌కు భారత జట్టు దూకుడు కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు న్యూజీలాండ్ సిరీస్‌లో ఇరగదీసిన విషయం తెలిసిందే. అభిషేక్ మెరుపు ఆరంభాలు ఇస్తుండడంతో భారత్ భారీ స్కోర్ చేస్తోంది. ఇక ఇషాన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన అతడు.. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. మెగా టోర్నీలో కూడా అదే ప్రదర్శన చేస్తాడని కెప్టెన్, కోచ్ నమ్మకంగా ఉన్నారు. దాంతో సంజూకు నిరాశే ఎదురుకానుంది. మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. గాయం నుంచి కోలుకున్న తిలక్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. సూర్య కూడా కివీస్ సిరీస్‌లో చెలరేగాడు. అనంతరం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుభవం జట్టుకు బలంగా నిలవనుంది. డెత్ ఓవర్లలో రన్స్ వరద పారించేందుకు రింకు సింగ్, శివమ్ దూబేలు ఉన్నారు, ఈ ఇద్దరిపై భారీ ఆశలున్నాయి. ఇటీవలి కాలంలో తమ పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను తిప్పేసిన ఈ ఇద్దరూ.. భారత్ స్కోరును పరుగులు పెట్టించే సామర్థ్యం కలవారు.
పేస్‌, స్పిన్‌తో వెరీ స్ట్రాంగ్‌..
బౌలింగ్ విభాగంలో భారత్ పూర్తి సమతుల్యతతో కనిపిస్తోంది. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి భుజాన వేసుకోనుండగా.. పేస్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ అండగా ఉన్నారు. వాంఖడే పిచ్‌పై ఈ బౌలింగ్ కాంబో సరిగ్గా సరిపోతుంది. ఏ ఇద్దరు రాణించినా ప్రత్యర్థికి కఠిన పరీక్షగా మారనుంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.